వనపర్తి జిల్లాలో సగం బస్సులకే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ లు

వనపర్తి  జిల్లాలో సగం బస్సులకే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ లు
  • స్కూళ్లు రీ ఓపెన్​ అయినా స్పందించని ప్రైవేటు స్కూళ్ల ఓనర్స్​
  • 16 లోగా ఫిట్​నెస్​ చేసుకోవాలని డీటీవో డెడ్​ లైన్​
  • జిల్లాలో 314 స్కూల్ బస్సులకు 108కే ఫిట్‌నెస్ పరీక్షలు  
  • విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న  ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు 

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లాలోని  ప్రైవేటు స్కూల్​యాజమాన్యాలు స్కూలు బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. గురువారం స్కూళ్లు రీ ఓపెన్ కాగా ఇప్పటికీ ఫిట్‌నెస్ చేయించిన బస్సులు 50 శాతం లోపే ఉండటం గమనార్హం.  స్కూల్  బస్సులు ఫిట్‌నెస్‌తో  ఉండాలని, నియమ నిబంధనలు పాటిస్తూ నడపాలని ఆర్టీఓ ఆఫీసర్లు పేర్కొంటున్నా ప్రైవేటు స్కూల్​ఓనర్స్​పెడచెవిన పెడుతున్నారు.  జిల్లాలో ఉన్న  ప్రైవేటు బస్సుల్లో ఇప్పటి వరకు కేవలం 45 శాతం బస్సులకే  ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించగా మిగతా వాటిని ఫిట్ నెస్ లేకుండానే నడిపిస్తున్నారు. 

45 శాతమే ఫిట్​నెస్​ పరీక్షలు

జిల్లాలో 177  వరకు ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. మొత్తం314 ప్రైవేటు స్కూలు బస్సులుంటే  అందులో 15 ఏళ్లు దాటినవి 72 ఉన్నాయి.  మిగతా 242 బస్సుల్లో స్కూళ్ల రీ ఓపెన్​నాటికి కేవలం108 బస్సులకే ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించారు. ఇంకా134 బస్సులకు పరీక్షలు చేయించాల్సి ఉంది. బస్సులో తప్పనిసరిగా ఫస్ట్​ఎయిడ్​కిట్ ఉండాలి. కానీ ​90 శాతం బస్సుల్లో ఉండడం లేదు. తనిఖీ సమయంలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి పంపిస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదు. 

బస్సుల్లో పవర్​ స్టీరింగ్​ ఉండాలి.  బ్రేకుల లోపాన్ని తెలిపే రెడ్​ఇండికేటర్​ఉండాలి. వెనుక దారి కనిపించేలా అద్దం, బస్సులో కూర్చున్న స్టూడెంట్లు కనిపించేలా ఇన్నర్​మిర్రర్, పిల్లలు బస్సుఎక్కి దిగేటప్పుడు కనిపించేలా క్రాస్​మిర్రర్‌‌లు ఉండాలి. ఎమర్జెన్సీ టైంలో బస్సు అద్దాన్ని పగులగొట్టేలా సుత్తి (హ్యమర్) ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవీ ప్రైవేటు బస్సుల్లో కనిపించడం లేదు. 

ఈ నెల 16 లోపు ఫిట్ నెస్ చేయించాలి

ఈ నెల 16వ తేదీ వరకు అన్ని స్కూల్​బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాలి.  ఫిట్‌నెస్ పరీక్షలు చేయించకుండా బస్సులు నడిపితే సీజ్​ చేస్తాం. తొందరగా బస్సులకు  ఫిట్ నెస్ చేయించాలి 
–   జిల్లా రవాణాశాఖ అధికారి, మానస