ట్రంప్ ఇమ్మిగ్రేషన్ షాక్: గ్రీన్ కార్డ్ కావాలా? అయితే ఇండియాకు రిటర్న్ వచ్చి అప్లై చేస్కోవాల్నిందే!

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ షాక్: గ్రీన్ కార్డ్ కావాలా? అయితే ఇండియాకు రిటర్న్ వచ్చి అప్లై చేస్కోవాల్నిందే!

అమెరికాలో స్థిరపడాలనే కలలతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది విదేశీ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. H-1B వీసా హోల్డర్లతో పాటు అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులు ఇకపై పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డ్ పొందటానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనంటూ యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ సరికొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది.

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులు అక్కడే(USలో) ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇకపై అనుమతించరు. అసాధారణ పరిస్థితుల్లో మినహా, గ్రీన్ కార్డ్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ తమ స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ తెలిపారు.

తాజా నిర్ణయం వల్ల ఏటా లక్షలాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు, ఐటీ రంగంలో స్థిరపడిన హెచ్-1బీ, ఎల్ వీసా ప్రొఫెషనల్స్ ఈ కొత్త రూల్‌తో తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాత్కాలిక వీసాలపై వచ్చే వారు తమ గడువు ముగియగానే దేశం విడిచి వెళ్లాలనేది చట్టం అసలు ఉద్దేశమని, కానీ కొన్నేళ్లుగా ఈ నిబంధనను నిర్లక్ష్యం చేశారని ట్రంప్ సర్కార్ పేర్కొంది.

గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయిన తర్వాత చాలా మంది అమెరికాలోనే అక్రమంగా ఉండిపోతున్నారని, స్వదేశం నుంచి అప్లై చేసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల విదేశాల్లోని యూఎస్ కాన్సులర్ ఆఫీసులపై భారం పెరిగినప్పటికీ, దేశీయంగా ఉన్న యూఎస్‌సీఐఎస్ వనరులను ఇతర ప్రాధాన్యత కలిగిన వీసాల ప్రాసెసింగ్‌కు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై, ముఖ్యంగా హెచ్-1బీ ఉద్యోగులు, ఆశ్రయం కోరేవారిపై ఆంక్షలు కఠినతరం చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగమే ఈ కొత్త పాలసీ. అయితే అధికారులు ప్రతి అప్లికేషన్‌ను వ్యక్తిగతంగా పరిశీలించి, కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే మినహాయింపులు ఇస్తామని మెమోలో పేర్కొన్నారు. మొత్తానికి అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చనే పద్ధతికి ట్రంప్ సర్కార్ స్వస్తి పలకడంతో విదేశీయుల్లో కొత్త టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అలా సొంత దేశానికి వెళ్లాక మళ్లీ తిరిగి వెనక్కి రానిస్తారా లేదా అనే అనుమానాలు కూడా చాలా ఫ్యామిలీలను వెంటాడుతున్నాయి. అంటే ఇకపై భారతీయ గ్రీన్ కార్డ్ ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఇండియాకు రిటర్న్ వచ్చి ఇక్కడే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట.