మావోయిస్టు కీలక నేత పాపారావు సరెండర్

మావోయిస్టు కీలక నేత పాపారావు సరెండర్

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలోని బస్తర్​ ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక కమాండర్​ పాపారావు(56) అలియాస్​ మంగూ అలియాస్​ సున్నం చంద్రయ్య మంగళవారం తన సహచరులతో కలిసి సరెండర్​ అయ్యారు. ఓ జర్నలిస్టు ద్వారా బీజాపూర్  జిల్లా కుట్రూ పోలీస్​స్టేషన్​కు తన వద్ద ఉన్న ఏకె-47 ఆయుధం, 17 మంది నక్సల్స్ తో వచ్చారు. అక్కడి నుంచి జగదల్​పూర్​కు ప్రత్యేక బస్సులో  వారిని తరలించారు. హిడ్మా, దేవా తర్వాత బస్తర్​ దండకారణ్యంలో పాపారావు  కీలకమైన నేత. 

అనేక ఎన్​కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆయన భద్రతా బలగాలపై అనేక సార్లు దాడులు చేశారు. దండకారణ్యం స్పెషల్  జోనల్​ కమిటీ మెంబర్​గా ఉన్న ఆయన ప్రస్తుతం పశ్చిమ బస్తర్​ డివిజన్​ కమిటీ ఇన్​చార్జి  కమాండర్​గా వ్యవహరిస్తున్నారు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. పాపారావు లొంగుబాటుతో బస్తర్​ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని డిప్యూటీ సీఎం విజయ్​శర్మ పేర్కొన్నారు. పాపారావు వంటి కీలక నేతలు లొంగిపోవడం సానుకూల సంకేతమని ఛత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​సాయి ఒక ప్రకటనలో తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్​ కమిటీ మెంబర్లు​ ప్రకాశ్​ మడావి, అనిల్​ తాతీ ఉన్నారు. సరెండర్​ అయిన 18 మందిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉండగా, 8 ఏకే-47లు, ఒక ఎస్ఎల్ఆర్​, ఒక ఇన్సాస్​తో పాటు ఇతర ఆయుధాలను వారు అప్పగించారు.