- టన్నుకు 20 డాలర్ల నుంచి 29 డాలర్లకు పెరిగిన షిప్పింగ్ చార్జీలు
- వార్ సెస్ కింద ఒక్కో కంటైనర్‌కు రూ.2 లక్షలు అదనం
- కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి నిలిచిన గ్రానైట్ ఎక్స్‌పోర్ట్స్
- కాకినాడ పోర్టులో నిలిచిపోయిన మార్బుల్, స్లాబ్ కంటైనర్లు, గ్రానైట్ క్యూబ్స్
- చైనా సహా కువైట్, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతర్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆగిన రవాణా
కరీంనగర్, వెలుగు: ఇరాన్, అమెరికా ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రాష్ట్రం నుంచి గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోయాయి. సరుకు రవాణా షిప్స్‌పై ఆంక్షలు విధిస్తుండడం, షిప్పింగ్ చార్జీలు పెంచడంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన గ్రానైట్, మార్బుల్స్, స్లాబ్స్ కంటైనర్లు కాకినాడ పోర్టులోనే నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని వ్యాపారులు, వర్కర్లు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు త్వరలో బల్క్ డీజిల్ అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో గ్రానైట్ క్వారీల్లో పనులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే వర్కర్లకు పని ఉండదని గ్రానైట్ వ్యాపారులు అంటున్నారు. కరీంనగర్, ఖమ్మం గ్రానైట్ హై క్వాలిటీది కావడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో లభించే టాన్ బ్రౌన్, మేపిల్ బ్రౌన్ రకం గ్రానైట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.
రాష్ట్రంలో ఉత్పతయ్యే గ్రానైట్ క్యూబ్స్‌తో పాటు మార్బుల్స్, స్లాబ్‌లు, టైల్స్(ఫినిషింగ్ గూడ్స్) దేశంలో 20 శాతం మేర అమ్మకాలు జరుగుతుండగా.. మిగతా 80 శాతం గ్రానైట్‌ను చైనాతో పాటు ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్, ఒమన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికా, కెనడా, జపాన్, కొరియాలాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో సగం వాటా చైనాదే. అయితే అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో షిప్పింగ్ చార్జీలను పెంచేశారు.
దీంతో ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి చైనాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు షిప్పుల ద్వారా గ్రానైట్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఒక్కో టన్ను గ్రానైట్ క్యూబ్‌కు 20 డాలర్ల చొప్పున వసూలు చేసే షిప్పు ఓనర్లు.. ఇప్పుడు 29 డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో చైనా, ఇతర దేశాల వ్యాపారులు మన గ్రానైట్‌ను తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కాకినాడ పోర్టులోనే వేలాది టన్నుల గ్రానైట్ నిలిచిపోయింది.
వార్ సెస్‌తో కంటైనర్లు వెనక్కి..
హర్మూజ్ జలమార్గం ద్వారా ఒక్కో కంటైనర్ నుంచి రూ.2 లక్షల వరకు ఇరాన్ వార్ సెస్‌గా విధిస్తుండడంతో వ్యాపారులకు ఆర్థిక భారం తప్పడం లేదు. వార్ సెస్ చెల్లిస్తే తమకు వ్యాపారం గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో గ్రానైట్ స్లాబ్‌లు, టైల్స్ ఉన్న కంటైనర్లతో వెళ్తున్న షిప్పులు వెనక్కి వచ్చేస్తున్నాయి. భారతీయ నౌకలకు ఇరాన్ మినహాయింపు ఇస్తే.. కంటైనర్లు వెళ్లే అవకాశముంది. మరోవైపు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 414 గ్రానైట్ క్వారీలు ఉండగా.. ఇందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 292 క్వారీలు, 200 వరకు పాలిషింగ్ యూనిట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40 క్వారీలు, పెద్దపల్లిలో 40, జగిత్యాల జిల్లాలో 42 ఉన్నాయి.
వీటి ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది, పరోక్షంగా మరో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలో 70 గ్రానైట్ క్వారీలు, 200 వరకు పాలిషింగ్ యూనిట్లు ఉండగా.. వీటి ద్వారా మరో లక్ష మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఎగుమతులు ఇలాగే మరికొన్నాళ్లు ఆగితే క్వారీల్లో ఉత్పత్తి కూడా నిలిపివేసే అవకాశముంది. ఇదే జరిగితే వీరందరికి ఉపాధి దెబ్బతినే ప్రమాదముంది.
బల్క్ డీజిల్ ఆపేస్తే ఉత్పత్తిపై ప్రభావం..
ప్రస్తుతం గ్రానైట్ క్యూబ్స్‌తో పాటు స్లాబులు, టైల్స్‌తో కూడిన కంటైనర్లను ఇతర దేశాల వ్యాపారులు తీసుకెళ్లడం లేదు. షిప్పింగ్ చార్జీలను ఒక్కసారిగా 50 శాతం వరకు పెంచడమే ఇందుకు కారణం. ఇరాన్ విధిస్తున్న వార్ సెస్ కూడా గ్రానైట్ వ్యాపారులకు భారంగా మారింది. దీంతో వాళ్లు గ్రానైట్‌ను తీసుకెళ్లడం లేదు. కాకినాడ పోర్టులో చాలా సరుకు ఉండి పోయింది. ప్రతి రోజు క్వారీల్లో వెయ్యి లీడర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఇప్పటికే బల్క్ డీజిల్ అమ్మకాలు ఆపేశారు. దీంతో క్వారీల్లోనూ ఉత్పత్తి ఆగే పరిస్థితి నెలకొంది.
- విజయభాస్కర్, అధ్యక్షుడు, కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్
