- వాయుసేన రవాణా, ఏఐ తనిఖీలపై మండిపడ్డ అన్నామలై
- అది 'సైనికీకరణ' కాదు, ప్రతిభను రక్షించడమేనన్న బీజేపీ
చెన్నై: జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష కోసం కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి భద్రత, వాయుసేన ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ ముఖ గుర్తింపు తనిఖీలపై తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యలు పరీక్షను ‘సైనికీకరణ’ చేయడమేనని, ఇది విద్యార్థులపై అదనపు మానసిక ఒత్తిడిని పెంచి, జాతీయ విద్యా విధానం ఆశయాలను దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేత వినోద్ సెల్వం స్పందిస్తూ చైనాలో నిర్వహించే ‘గావోకావో’ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఇలాంటి కఠిన నిబంధనలు సాధారణమేనని, ఇది సైనికీకరణ కాదు ప్రతిభను రక్షించడమేనని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, పరీక్షకు కొన్ని రోజుల ముందే అభ్యర్థులు అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) స్పందిస్తూ సర్వర్ లోపాలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
