టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ యుద్ధం ముగియాలంటే తాము పెట్టే మూడు షరతులకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని, యుద్ధంలో తమకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి పరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో మళ్లీ తమపై దాడులు చేయబోమని అంతర్జాతీయ సమాజం గట్టి హామీని ఇవ్వాలని ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు.
"దురాక్రమణదారులైన అమెరికా, ఇజ్రాయెల్ వల్లే ఈ యుద్ధం మొదలైంది. ఇది ముగియాలంటే మా షరతులకు అంగీకరించాల్సిందే" అని ఆయన తేల్చిచెప్పారు. రష్యా, పాకిస్థాన్ దేశాల నాయకులతో తాను మాట్లాడానని, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పానన్నారు. అయితే, తమపై దాడులు కొనసాగితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా ఏకపక్షంగా యుద్ధం ముగిసిందని ప్రకటించినా లేదా కాల్పుల విరమణ జరిగినా.. తమ షరతులు నెరవేరకపోతే దాడులు కొనసాగిస్తామన్నారు. కాగా, ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫజల్ షేకర్చీ ప్రభుత్వ టీవీ చానెల్ ‘ఐఆర్ఐబీ’ ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
"ఒకవేళ అమెరికా గనుక మా దేశంలోని పోర్టులపై దాడులు చేస్తే.. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఏ ఆర్థిక కేంద్రం, ఏ పోర్టు కూడా సురక్షితంగా ఉండదు. వాటన్నింటినీ మేం లక్ష్యంగా చేసుకుంటాం" అని ఆయన అన్నారు. తమ తమ ప్రాంతాల నుంచి అమెరికన్లను తరిమికొట్టాలని పొరుగు దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఇజ్రాయెల్ అధికారుల అంచనా ప్రకారం.. యుద్ధం త్వరలో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా కూడా ఇప్పుడప్పుడే యుద్ధాన్ని ఆపాలని ఆదేశించే అవకాశం లేదని సదరు అధికారులు చెప్పినట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది.
