ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడనే హత్య.. జులై18న వరంగల్ లో కాంగ్రెస్ లీడర్ మర్డర్..ఏడుగురు అరెస్ట్

ఇమేజ్ డ్యామేజ్  చేస్తున్నాడనే హత్య.. జులై18న వరంగల్ లో కాంగ్రెస్ లీడర్ మర్డర్..ఏడుగురు అరెస్ట్

వరంగల్‍, వెలుగు : గ్రేటర్ వరంగల్ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న జరిగిన కాంగ్రెస్‍ పార్టీ నాయకుడు అడుప మహేశ్‍ హత్య కేసు మిస్టరీ వీడింది. పెద్ద లీడర్ల వద్ద తన క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నాడన్న కక్షతోనే మహేశ్ ను హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ ఎన్.శ్వేత ఆదివారం వెల్లడించారు. 14వ డివిజన్‍ ఏనుమాముల మార్కెట్‍ సమీపలోని ఎన్‍టీఆర్‍ నగర్‍కు చెందిన మహేశ్‍ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉంటున్నాడు. పట్టి కుమార్ అనే వ్యక్తి సైతం అదే పార్టీలో తిరుగుతున్నాడు.

 కుమార్‍ 2018లో మరో యువకుడితో కలిసి సాంబయ్య అనే వ్యక్తిని హత్య చేసి బెయిల్‍ బయటకు వచ్చాడు. ఈ  క్రమంలో నియోజకవర్గ లీడర్ల వద్ద తన ఇమేజ్‍ దెబ్బతీస్తున్నాడని మహేశ్ పై కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. దీంతో మహేశ్ ను హత్య చేయాలని కుమార్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం గంధం నరేశ్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్‍, సురేశ్, లాసారి రాంసాయి,  టోని సంజయ్‍, పోతారం శివకుమార్‍తో కలిసి ప్లాన్‍ చేశాడు. 

ఇందులో భాగంగా ఈ నెల 18న మహేశ్ ను గీసుగొండ పోలీస్‍ స్టేషన్‍ పరిధిలోని కోటిలింగాల గుడి పరిమళ కాలనీ సమీపంలోకి పిలిపించారు. అతడు వచ్చాక పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ మహేశ్‍ను హైదరాబాద్‍ కు తరలించగా.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ 19న చనిపోయాడు.

 కేసు నమోదు చేసిన గీసుకొండ ఇనెస్పెక్టర్ విశ్వేశ్వర్‍ ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి సురేశ్ మినహా మిగితా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకున్న మామునూర్‍ ఏసీపీ వెంకట్‍, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‍, ఇనెస్పెక్టర్లు విశ్వేశ్వర్‍, బాబులాల్‍, సుబ్బారెడ్డి, దేవేందర్‍, శ్రీధర్‍ను సీపీ అభినందించారు.