- వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్ లో సమస్యల తిష్ట
- రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే అయినా మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు
- నిర్వహణ కొరవడి మూలనపడుతున్న పరికరాలు
- పదేండ్లలోనే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్
హనుమకొండ, వెలుగు: విద్యార్థుల్లో సైన్స్‌పై అవగాహన పెంపొందించి, వారిని పరిశోధనల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో వరంగల్‌లో ఏర్పాటు చేసిన రీజినల్ సైన్స్ సెంటర్ ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారింది. రాష్ట్రంలోనే ఏకైక సైన్స్ సెంటర్ అయినప్పటికీ సరైన పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడంతో పరికరాలు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో సైన్స్ సెంటర్ పునరుద్ధరణ, అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చలు జరుపుతున్నా కనిపించడం లేదు. స్కూల్స్ రీఓపెనింగ్ నాటికైనా సెంటర్‌ను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డులోని జూపార్క్ ఎదురుగా గుట్టపై 1999లో సైన్స్ సెంటర్‌ను నిర్మించారు. దాదాపు రూ.6 కోట్లతో భవనం నిర్మించి, రూ.కోటితో సుమారు 69 రకాల ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు. పనులు ఆలస్యంగా సాగడంతో ఈ సెంటర్‌ను 2015లో ప్రారంభించారు. నిర్వహణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్పగించారు. సైన్స్ సెంటర్‌లో పర్యావరణం, మానవ పరిణామ క్రమం, శరీర నిర్మాణం, డీఎన్ఏ నిర్మాణం, ఖగోళ శాస్త్రం వంటి అంశాలకు సంబంధించిన పరికరాలతో ఏడు హాల్స్ ఏర్పాటు చేశారు.
అయితే సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో 69 ఎగ్జిబిట్లలో సుమారు 25 పరికరాలు పనిచేయని స్థితికి చేరాయి. సెంట్రల్ ఏసీ పనిచేయకపోవడం, ఫ్యాన్ల సదుపాయం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువసేపు ఎగ్జిబిట్లను పరిశీలించలేకపోతున్నారు. భవనం కూడా పదేళ్లకే బీటలు వారుతూ శిథిలావస్థకు చేరింది. రూఫ్, గోడలు దెబ్బతినడంతో పరిస్థితి దయనీయంగా మారింది.దాదాపు రెండు సంవత్సరాల క్రితం రూ.1.6 కోట్లతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి ఐడియా ల్యాబ్, రీసెర్చ్ సెంటర్, డిజైన్ స్టూడియో వంటి సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదు. సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థుల రాక కూడా తగ్గింది. గత ఏడాది సుమారు 11,244 విద్యార్థులు సెంటర్‌ను సందర్శించగా, టికెట్ల రూపంలో రూ.1.71 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది.
ప్రపోజల్స్ పై కసరత్తు
సైన్స్ సెంటర్ పునరుద్ధరణ కోసం ఇటీవల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించి సమస్యలను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుడా ఆధ్వర్యంలో మొదట రూ.4 కోట్లతో భవనం రిపేర్లు, టాయిలెట్లు, లైటింగ్, ఇతర సివిల్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ఆధునిక పరికరాలు, ఎగ్జిబిట్ల మరమ్మతులతో కలిపి రూ.10 కోట్లతో మరో ప్రతిపాదన రూపొందించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన తరువాత పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ నాటికి సెంటర్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు, విద్యావేత్తలు కోరుతున్నారు.

