డిసెంబర్‌‌‌‌ నాటికి వరంగల్‌‌ ఆస్పత్రి సిద్ధం కావాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ

డిసెంబర్‌‌‌‌ నాటికి  వరంగల్‌‌ ఆస్పత్రి సిద్ధం కావాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ
  •     అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం 
  •     4 నెలల్లో అల్వాల్‌‌ టిమ్స్‌‌ను అందుబాటులోకి తేవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: వరంగల్‌‌ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, డిసెంబర్‌‌‌‌ నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్‌‌లో టిమ్స్‌‌ అల్వాల్‌‌, టిమ్స్‌‌ ఎల్బీ నగర్‌‌‌‌, వరంగల్‌‌ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌‌ హాస్పిటల్‌‌లో ఎక్స్‌‌రే, సీటీ స్కాన్‌‌, ఇతర పరికరాల ఇన్‌‌స్టాలేషన్ సెప్టెంబర్‌‌‌‌కల్లా, మొత్తం పనులు అక్టోబర్‌‌‌‌ వరకు పూర్తవుతాయని అధికారులు చెప్పగా, నవంబర్‌‌‌‌లో ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు.

డాక్టర్ల ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ ప్రతి 15 రోజులకోసారి వరంగల్ వెళ్లి నిర్మాణ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని వసతులతో అల్వాల్‌‌ టిమ్స్‌‌ను ఈ ఏడాది చివరి నాటికి, ఎల్బీనగర్‌‌‌‌ టిమ్స్‌‌ ను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, స్పెషల్ సీఎస్‌‌, ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

ముందస్తు నివారణే లక్ష్యం..

గతేడాదితో పోలిస్తే డెంగ్యూ, మలేరియా, చికున్‌‌ గున్యా, డయేరియా, డిసెంట్రీ కేసులు తగ్గాయని, టైఫాయిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయని మరో సమీక్షలో అధికారులు మంత్రి దామోదర్‌‌‌‌కు వివరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వ్యాధులు వచ్చాక చికిత్స కంటే ముందే అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌‌‌‌ సర్వేలను ముమ్మరంగా కొనసాగిస్తూ, జ్వరం లక్షణాలున్న వారికి టెస్టులు చేసి, ఫ్రీగా మందులు అందించాలని చెప్పారు.

ఐఎల్‌‌ఐ కేసులపై వారానికో రిపోర్ట్‌‌ ఇవ్వండి..

ఢిల్లీ, మహారాష్ట్రల్లో స్వైన్‌‌ ఫ్లూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఐఎల్‌‌ఐ (ఇన్‌‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌‌నెస్‌‌) కేసులను రోజూ పర్యవేక్షిస్తూ వారానికోసారి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్‌‌, పంచాయతీరాజ్‌‌ శాఖల సమన్వయంతో శుక్రవారం డ్రై డే, ఫాగింగ్‌‌, లార్వా నిర్మూలన చర్యలు వేగవంతం చేయాలన్నారు. 

జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌‌లు క్లస్టర్లను వెంటనే గుర్తించాలన్నారు. సమీక్షల్లో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, కలెక్టర్లు ప్రియాంక, మనూ చౌదరి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.