- నిర్వాహకుడితో పాటు 11 మందిని పట్టుకున్న పోలీసులు
హనుమకొండ, వెలుగు : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిర్వాహకుడితో పాటు మరో 11 మంది పంటర్లను వరంగల్ టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ పి.నరసింహారావు శుక్రవారం కేయూ పీఎస్‌లో వెల్లడించారు. హనుమకొండలోని గోపాలపూర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన గట్ల రాజేశ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే తన ఇంట్లో గుట్టుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
చింతగట్టుకు చెందిన గర్నెపల్లి అరవింద్‌కుమార్, ముప్పారపు రాజేంద్రప్రసాద్, ఖిలావరంగల్‌కు చెందిన చిట్ల రాజేశ్, దేవర వినయ్, జెట్టబోయిన కుమార్, చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన వంగ శివకుమార్, భాషబోయిన శ్రీకాంత్, ఈర్ల విగ్నేశ్, స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన గంగుల అనిల్, బూరు మధుకర్, పులిగిళ్ల రవీందర్‌బాబు బెట్టింగ్‌లు వేస్తున్నారు. సమాచారం అందుకున్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గట్ల రాజేశ్ ఇంటిలో సోదాలు చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న రాజేశ్‌తో పాటు మిగతా 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.06 లక్షలు, 12 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
