వార్నింగ్ బెల్ : హైదరాబాద్ లో వైన్ షాపులన్నీ క్లోజ్ చేస్తాం..!

వార్నింగ్ బెల్ : హైదరాబాద్ లో వైన్ షాపులన్నీ క్లోజ్ చేస్తాం..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరగనుంది.. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిబంధనల ప్రకారం మందు, డబ్బు విషయంలో నియంత్రణలు ఉన్నాయి. 50 వేల రూపాయలకు కంటే ఎక్కువ డబ్బు తరలించటానికి వీల్లేదు.. అలా ఎవరైనా 50 వేల రూపాయలకు మించి డబ్బును తీసుకెళుతున్నట్లు అయితే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సిందే.

హైదరాబాద్ తోపాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతుంది. ఇందులో లిక్కర్ సేల్స్.. వైన్ షాపులకు సంబంధించిన డబ్బు ఎక్కువగా ఉంటుంది అనేది వైన్స్ షాప్ అసోసియేషన్ ప్రతినిధి నాగుల ప్రభాకర్ చెబుతున్నారు. లిక్కర్.. వైన్ షాపులు, బార్లలోని సేల్స్ కౌంటర్ ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి తీసుకెళుతున్న సమయంలో.. పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు ప్రభాకర్. అక్టోబర్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. అంటే ఐదు రోజుల్లోనే.. 56 వైన్ షాపులకు సంబంధించిన డబ్బు సీజ్ చేసినట్లు చెబుతున్నారాయన. ఉద్యోగి వివరాలు, లైసెన్స్ పత్రాలు చూపించినా.. పోలీసులు విడిచిపెట్టటం లేదని.. సీజ్ చేస్తున్నారు ఆరోపిస్తూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కంప్లయింట్ చేసినట్లు వెల్లడించారు ప్రభాకర్.

మఫ్టీలో వస్తున్న పోలీసులు.. వైన్ షాపుల దగ్గర దౌర్జన్యం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాగే చేస్తే.. దాడులు ఇదే విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయ్యే వరకు.. వైన్ షాపులు క్లోజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్. వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తూ.. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంటే.. మమ్మల్నే దొంగలు చూస్తారా అంటూ ప్రశ్నించారాయన. ఉద్యోగి వివరాలు, షాపు లైసెన్స్ పత్రాలు ఉన్నా.. డబ్బులు సీజ్ చేస్తామంటే వైన్ షాపులు బంద్ చేసి.. ఇంట్లో కూర్చుంటామని వార్నింగ్ ఇచ్చారు.

చూడాలి రాబోయే రోజుల్లో.. ఎన్నికల ప్రచార హోరులో వైన్ షాపులు ఉంటాయా.. బంద్ అవుతాయా అనేది...