ఎలక్ట్రానిక్ వస్తువుల వారెంటీకి కొత్త రూల్​ 

 ఎలక్ట్రానిక్ వస్తువుల వారెంటీకి కొత్త రూల్​ 

న్యూఢిల్లీ: వినియోగదారులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ వస్తువులకు వారెంటీ ఇక నుంచి కొనుగోలు తేదీకి బదులు ఇన్‌‌‌‌స్టాలేషన్ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎయిర్ కండీషనర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు,  వాటర్ కూలర్లు వంటి ఇన్‌‌‌‌స్టాలేషన్ అవసరమయ్యే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ కొత్త విధానం వర్తిస్తుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఈ నిర్ణయాన్ని తాజగా ప్రకటించింది.

ప్రస్తుతం, వారెంటీలు కొనుగోలు తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దీనివల్ల వినియోగదారులకు వారెంటీ సమయం తగ్గుతోంది. ఈ మార్పును అమలు చేయడానికి  రాబోయే 15 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని సీపీపీఏ ఎలక్ట్రానిక్​వస్తువుల తయారీదారులను ఆదేశించింది. అన్ని ప్రధాన ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారులతో సంప్రదింపులు జరిపింది.  సీపీపీఏ చీఫ్ కమీషనర్ నిధి ఖరే అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారులు వారెంటీ  గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు.

వినియోగదారులు తమ ఇంట్లో వస్తువును ఇన్‌‌‌‌స్టాల్ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించడం ప్రారంభించగలరని, ఇన్​స్టాలేషన్​తరువాత నుంచి వారెంటీ ఉండటం వల్ల వారికి మేలు జరుగుతుందని నిధి చెప్పారు.  

ఓకే చెప్పిన కంపెనీలు

రిలయన్స్ రిటైల్, ఎల్‌‌‌‌జీ, పానాసోనిక్, హాయర్, క్రోమా, బాష్ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీల ప్రతినిధులు సీపీపీఏ చీఫ్ కమీషనర్ నిధి ఖరేతో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారులు కూడా వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సమస్యను ముందస్తుగా పరిష్కరించడానికి అంగీకరించారని సీసీపీఏ పేర్కొంది. ఈ కొత్త నిర్ణయం వల్ల పెద్దగా తేడా ఉండబోదని కంపెనీల ఎగ్జిక్యూటివ్​లు అంటున్నారు.

ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌లు సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల్లో పూర్తవుతాయి కాబట్టి దీని ప్రభావం పెద్దగా ఉండబోదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లానింగ్ అండ్​ కంట్రోల్ జనరల్ మేనేజర్ మంజీత్ సింగ్ చావ్లా చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం, వైట్ గూడ్స్ మార్కెట్ విలువ 2025 నాటికి 21 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుంది. ఇది ఏటా 11 శాతం పెరుగుతోంది.