
- నీటి కేటాయింపులపై ఆందోళన
- ఇప్పటికే మేడిగడ్డకు195 టీఎంసీల అలకేషన్
- గోదావరి వాటా 968 టీఎంసీల్లో 940 టీఎంసీల వరకు క్లియరెన్స్
- మిగిలిన జలాలతోనే ప్రాజెక్టుకు కేటాయింపులెట్లన్న సందేహాలు
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఎలాగైనా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. కానీ, ఇప్పుడా ప్రాజెక్టుకు కాళేశ్వరం చిక్కుముడిలా మారుతోంది. నీటి కేటాయింపులే తుమ్మిడిహెట్టికి అడ్డంకిగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో 165 టీఎంసీల తరలింపుతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు నడుం బిగించారు. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక కొన్నాళ్లు ఆ ప్రాజెక్టుపై పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి లభ్యత ఉన్నా లేనట్టుగా చూపించి, కాళేశ్వరం పేరిట రీడిజైన్ చేసి బ్యారేజీ స్థలాన్ని మేడిగడ్డకు మార్చింది.
195 టీఎంసీల వినియోగానికి సెంట్రల్వాటర్ కమిషన్ నుంచి కేటాయింపులకు క్లియరెన్స్ కూడా వచ్చింది. గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,486 టీఎంసీల కేటాయింపులుండగా.. మన రాష్ట్ర వాటాగా 968 టీఎంసీలున్నాయి. అందులో ఇప్పటికే 940 టీఎంసీల దాకా కేటాయింపులు వచ్చాయి. మిగిలింది 28 టీఎంసీల నీళ్లే. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే కొత్తగా మళ్లీ కేటాయింపులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మేడిగడ్డ డిజైన్లు ఎవరితో..?
మేడిగడ్డ బ్యారేజీ రీహాబిలిటేషన్ డిజైన్లపై (రిపేర్లు చేస్తే కొత్తగా ఇచ్చే డిజైన్లు) రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేయించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అక్కడి నేల పరిస్థితులను తెలుసుకునేందుకు పుణేకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులతో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద పరీక్షలు చేయిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా అక్కడి పరిస్థితులను నిపుణులు అంచనా వేశారు.
కొద్దిరోజుల క్రితం మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం వెళ్తుండడంతో.. ప్రవాహ తీరుతెన్నులపై అధికారులు స్టడీ చేశారు. వరద ప్రవాహవేగం, ఇతర పరిస్థితులను అంచనా వేశారు. వరదలు తగ్గుముఖం పట్టాక అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను ప్రారంభించనున్నారు. అయితే, అక్కడ డిజైన్ల విషయంలోనే కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బ్యారేజీల డిజైన్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కీలక విభాగమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)తో చేయించాలని తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. ఆ దిశగా అధికారులకూ ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత మాత్రం డిజైన్లను థర్డ్ పార్టీతో చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.
ఐఐటీ రూర్కీతో డిజైన్లు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని అంటున్నారు. ఇప్పటికైతే అదింకా ఫైనల్ కాలేదని, ఎవరితో చేయించాలన్నది త్వరలో డిసైడ్ అవుతుందని అధికార వర్గాలంటున్నాయి. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు మొత్తం సీడీవో తప్పే అన్నట్టుగా ఐఐటీ రూర్కీ రిపోర్ట్ ఇచ్చిందని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను బ్లేమ్ చేసేలా నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోనే ఐఐటీ రూర్కీ ఇలాంటి రిపోర్టును తయారు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐఐటీ రూర్కీకి డిజైన్ల బాధ్యత అప్పగిస్తే తప్పుడు సంకేతాలువెళ్లే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
80 టీఎంసీలు వాడుకునేలా..
నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చినట్టు చెబుతున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 80 టీఎంసీలు తరలించుకునేలా ప్రాజెక్టును నిర్మించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు.. ప్రాణహిత చేవెళ్లలో భాగమైన రంగారెడ్డి జిల్లాలోని 2.47 లక్షల ఎకరాల ఆయకట్టును కేసీఆర్ ప్రభుత్వం తొలగించేసింది. ఇప్పుడు ఆ 2.47 లక్షల ఎకరాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని 2.16 లక్షల ఎకరాలకు నీటిని సప్లిమెంట్ చేసేలా తుమ్మిడిహెట్టిని వాడుకోవాలని యోచిస్తోంది.
ఆ 5 లక్షల ఎకరాలకు 50 టీఎంసీలు, మిగతా 30 టీఎంసీలు తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం 80 టీఎంసీలను ఇప్పటికే మిగిలి ఉన్న జలాలతో పాటు.. మేడిగడ్డ నుంచి బదలాయింపులతో భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా నీళ్లను ఇప్పటికే ఉన్న సిస్టమ్స్ ద్వారా ఆయకట్టుకు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
తుమ్మిడిహెట్టికి బదలాయించే యోచన!
తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ విషయంలో ఇరిగేషన్ సర్కిల్స్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవుతుందని కొందరు చెబుతుండగా.. రెండింటినీ సమాంతరంగా నడుపుకునేందుకు వీలవుతుందని మరికొందరు ఉన్నతాధికారులు అంటున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు కేటాయింపులు రావాలంటే మేడిగడ్డను వదిలేసుకోవాల్సిందేనని, ఆ మేరకు కేటాయింపులు తుమ్మిడిహెట్టికి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగైతేనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ముందుకు వెళ్తుందంటున్నారు. ఒకవేళ మేడిగడ్డను వాడుకోవాలనుకుంటే మాత్రం తుమ్మిడిహెట్టిని వదిలేయాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటు మేడిగడ్డను వాడుకుంటూనే తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లను తీసుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మేడిగడ్డ నుంచి తరలించే నీళ్లలోని కేటాయింపులను తగ్గించుకుని ఆ మేరకు తుమ్మిడిహెట్టికి బదలాయించుకుంటే సమస్యలు రావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డను పునరుద్ధరించినా ఎలాగూ మునుపటి స్థాయిలో పూర్తి స్థాయిలో వాడుకునేందుకు వీలుండదని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి తరలించే నీటిని తగ్గించుకునేందుకు అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. దానికి సప్లిమెంట్‌గా తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే.. ప్రస్తుతం వాటాలో మిగిలి ఉన్న జలాలతో పాటు.. మేడిగడ్డలోని మరికొంత వాటానూ అక్కడ వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవచ్చని చెబుతున్నారు.