- వచ్చే 12 నెలలదాకా తాగునీటికే తొలి ప్రాధాన్యం
- ప్రాజెక్టుల్లో 808 టీఎంసీలకు 465 టీఎంసీలే లభ్యం
- వర్షాభావంతో 19,543 మెగావాట్లకు పెరిగిన విద్యుత్ డిమాండ్
- ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో వల్ల రాష్ట్రంలో వర్షపాత లోటు, ప్రాజెక్టుల్లోకి తగ్గిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యంగా రాబోయే 11 నుంచి 12 నెలల కాలానికి తాగునీటికి ఎలాంటి ఎద్దటి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గి, వినియోగం పెరిగిందన్నారు.
అయినప్పటికీ..థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తి వినియోగం, సింగరేణి బొగ్గు కేటాయింపులు, నైని బ్లాక్ నుంచి అందిన బొగ్గు, మార్కెట్ కొనుగోళ్లతో సమర్థవంతంగా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రభుత్వం ముందే పసిగట్టి ఏప్రిల్ నుంచే ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోందని అసెంబ్లీలో ఎల్ నినో ఎఫెక్ట్ పై జరిగిన షార్ట్ డిస్కషన్ లో భట్టి వివరించారు.
నీటి నిల్వపై నిరంతర నిఘా
రాష్ట్రంలో ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం 808 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 465 టీఎంసీలే (కృష్ణాలో 311, గోదావరిలో 154) అందుబాటులో ఉన్నాయని భట్టి చెప్పారు. తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు 34 కీలక జలాశయాల నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సింగూరు రిజర్వాయర్‌లో 12 టీఎంసీలకు గాను కేవలం 4.35 టీఎంసీలే ఉండటంతో, నిజామాబాద్, కామారెడ్డిలకు ఎస్సారెస్పీ ద్వారా, మెదక్‌కు మల్లన్నసాగర్, సంగారెడ్డికి శ్రీశైలం ప్లాంట్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు.
హైదరాబాద్ పరిసరాల్లోని 3 లక్షల కనెక్షన్లకు మిషన్ భగీరథ ద్వారా 40 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్ డేలు, గోదావరి, కృష్ణా జలాల ద్వారా మరో 20 ఎంజీడీలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, దేవాదుల, అలీసాగర్, గుత్ప తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లు, చెరువులను నింపుతున్నామన్నారు. తెలంగాణ జలసిరి ద్వారా 24 లక్షల ఇంకుడు గుంతలు, 50 వేల వ్యవసాయ కుంటలు, 12 వేల పర్కొలేషన్ చెరువులు, 12 వేల బోరుబావుల రీచార్జి పనులను వేగవంతం చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ డిమాండ్‌ను అధిగమించాం
వర్షాభావం వల్ల రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బోరుబావులు, ఎత్తిపోతల పథకాల వాడకం పెరగడంతో గతేడాది 250 నుంచి -450 మెగావాట్లుగా ఉన్న ఎత్తిపోతల లోడ్ ఈసారి 1,600 మెగావాట్లకు చేరిందన్నారు. జలాశయాల్లో నీరులేక జలవిద్యుత్ ఉత్పత్తి 1,940 నుంచి 422 మెగావాట్లకు పడిపోయిందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 9న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని (గతేడాది 15,585 మెగావాట్లు) వెల్లడించారు. అయినప్పటికీ థర్మల్ ప్లాంట్లు, సింగరేణి బొగ్గు, మార్కెట్ కొనుగోళ్ల ద్వారా డిమాండ్‌ను తట్టుకుంటూ నిరంతరం విద్యుత్ సరఫరా చేశామని స్పష్టం చేశారు.
రైతులకు ముందస్తు అవగాహన కల్పించాం...
ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం ముందస్తుగా జులై 21న సదస్సు నిర్వహించిందని భట్టి తెలిపారు. 27 మంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రణాళికలు అమలు చేశామని వెల్లడించారు. 'రైతు ముంగిట శాస్త్రవేత్తలు' ద్వారా 1,600 గ్రామాల్లో అవగాహన కల్పించడంతో వరి సాగు 18% తగ్గి, మొత్తం సాగు 123.74 లక్షల ఎకరాలకు పరిమితమైందన్నారు.
సభలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి (24% వర్షపాత లోటు), బీర్ల ఐలయ్య (సమన్వయంతో ఎదుర్కోవడం), రాకేశ్ రెడ్డి (చెరువుల పరిరక్షణ, కాల్వల లీకేజీ అరికట్టడం) పలు సమస్యలు లేవనెత్తారు. విపత్తును ముందే గుర్తించి అప్రమత్తం చేయడమే ప్రభుత్వ విధానమని, అన్ని శాఖల సమన్వయంతో సంక్షోభాన్ని అధిగమిస్తామని భట్టి భరోసానిచ్చారు.
