
- డబ్ల్యూసీఎల్ విన్నర్‌గా సౌతాఫ్రికా చాంపియన్స్
- ఫైనల్లో పాకిస్తాన్ చాంపియన్స్‌పై గ్రాండ్ విక్టరీ
బర్మింగ్‌హామ్: ఇంటర్నేషనల్ క్రికెట్, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా తన బ్యాట్ పవర్ తగ్గలేదని సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (60 బాల్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 నాటౌట్) చాటి చెప్పాడు. మాజీ క్రికెటర్లు బరిలో నిలిచిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) ఫైనల్లో పాకిస్తాన్‌పై 47 బాల్స్‌లో సెంచరీ కొట్టి సౌతాఫ్రికా చాంపియన్స్‌కు ట్రోఫీ అందించాడు. ఏబీ మెరుపులతో ఆదివారం జరిగిన ఈపోరులో సఫారీ టీమ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చాంపియన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. ఓపెనర్ షర్జీల్ ఖాన్ (44 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) ఫిఫ్టీ కొట్టగా.. ఉమర్ అమిన్ (36 నాటౌట్), ఆసిఫ్ అలీ (28) రాణించారు. సఫారీ బౌలర్ల హర్డస్ విల్జోయెన్, వేన్ పార్నెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో డివిలియర్స్ మెరుపు సెంచరీకి తోడు జేపీ డుమినీ (50 నాటౌట్) ఫిఫ్టీ కొట్టడంతో సౌతాఫ్రికా చాంపియన్స్ టీమ్ 16.5 ఓవర్లలోనే 197/1 స్కోరు చేసి గెలిచింది. ఏబీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
డబ్ల్యూసీఎల్‌పై పీసీబీ నిషేధం
ఈ టోర్నమెంట్ నిర్వాహకులు తీవ్ర పక్షపాతంతో వ్యవహరించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆరోపించింది. భవిష్యత్తులో ఈ లీగ్‌లో తమ ఆటగాళ్లు పాల్గొనకుండా పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సెమీస్‌తో పాటు గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్‌తో ఆడేందుకు ఇండియా టీమ్ నిరాకరించింది. అయితే, మ్యాచ్ ఆడకుండా తప్పుకున్నప్పటికీ డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఇండియాకు పాయింట్లు కేటాయించడాన్ని పీసీబీ తీవ్రంగా తప్పుబట్టింది.‘గ్రూప్ దశలో ఆడటానికి నిరాకరించిన జట్టుకు (ఇండియా) పాయింట్లు కేటాయించడం నిర్వాహకుల ద్వంద్వ వైఖరికి, పక్షపాతానికి నిదర్శనం. ఇండియాతో మ్యాచ్‌ల రద్దుకు క్రికెట్ కారణాలు కావు. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ, పక్షపాత రాజకీయాలతో నడిచే ఇలాంటి ఈవెంట్లలో మా జట్టు పాల్గొనేది లేదు’ అని పీసీబీ తేల్చిచెప్పింది.