- కాల్ డిటెయిల్స్ రికార్డ్స్ పరిశీలిస్తున్నం
- మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తం
- పేట్ బషీర్‌బాద్ స్టేషన్‌కు వెళ్లి కేసుపై అధికారులతో రివ్యూ
- పర్యవేక్షణ అధికారిగా రితిరాజ్‌ను నియమించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పట్టుకుంటామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేశామన్నారు. మరోసారి ఆమెతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
నిందితుడి సంబంధించి ఇప్పటికే పలు డాక్యుమెంట్లు పరిశీలించామని.. ఫోన్ కాల్ డిటెయిల్స్ రికార్డ్(సీడీఆర్) సేకరిస్తున్నామని వెల్లడించారు. కానీ నిందితుడు దొరకలేదని.. కచ్చితంగా పట్టుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మహిళా ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి సోమవారం మెమో జారీ చేశారు.
కేసుకు సంబంధించిన అన్ని అంశాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశీలించాలని సీపీ రమేశ్ రెడ్డి ఆదేశించారు. వృత్తిపరమైన పద్ధతిలో నిబంధనలకు లోబడి దర్యాప్తు జరిగేలా చూడాలని సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహిరించాలని దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతిరోజూ తప్పనిసరిగా సమర్పించాలని సీపీ ఆదేశించారు. కేసు పర్యవేక్షణలో భాగంగా డీసీపీ రితిరాజ్ పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ కోసం గాలిస్తున్నామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దర్యాప్తు జరుగుతున్నదని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలు డాక్యుమెంట్లతో పాటు నిందితుడి ఫోన్ కాల్ డిటెయిల్స్ రికార్డ్ సేకరిస్తున్నామని వెల్లడించారు.
త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. కేసు పర్యవేక్షణలో భాగంగా పేట్‌బషీరాబాద్ పోలీసులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు చేశారు.. తదుపరి దర్యాప్తు గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించామని వెల్లడించారు. దర్యాప్తుకు అవసరమైన మరికొంత సమాచారం సేకరించేందుకు బాధితురాలి స్టేట్‌మెంట్ మరోసారి రికార్డు చేయాల్సి ఉందన్నారు. ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సీఎం రేవంత్‌తో డీజీపీ భేటీ
బండి భగీరథ్ పై నమోదు పోక్సో కేసు విచారణ వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ప్రశ్నించారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సీఎంకు వివరించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని డీజీపీ తెలిపారు.
డీజీపీతో భేటీ తర్వాత సీఎం మీడియాతో చిట్ చాట్ లో ఈ వివరాలను వెల్లడించారు. తాను రాజకీయ కక్షసాధింపులకు పాల్పడనని స్పష్టం చేశారు. తమది సిస్టమాటిక్ గవర్నెన్స్ అన్నారు. అధికారం ఉందని విచక్షణా రహితంగా ప్రవర్తించబోనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై మే 8న ఎఫ్‌ఐఆర్ నమోదైందని, 9, 10 తేదీల్లో మోదీ పర్యటనతో పోలీసుల బందోబస్తు డ్యూటీలతో విచారణ ఆలస్యమైందని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఫిర్యాదు చేసి, ఆపై ప్రభాకర్ రావును నీతిమంతుడని చెప్పారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమారుడి ఎఫ్ఐఆర్కు సంబంధించి ఏమైనా ఆధారాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మైకుల ముందు స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల విచారణ జరగదని అన్నారు. కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో.. డ్రగ్స్ దొరికినా వదల్లేదని చెప్పారు.
