- మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్‌కే మేం వ్యతిరేకం
- మూసీ కోసం మాత్రం రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరదీసిండని ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని.. కానీ, మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్‌కే వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మూసీ సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసలు మూసీ బ్యూటిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది కేసీఆర్ అని, రూ.4 వేల కోట్లతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని గుర్తుచేశారు.
కానీ, రేవంత్ తుగ్లక్ పాలన చేస్తున్నారన్నారు. ‘‘మూసీ శుద్ధీకరణను పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మూసీ అభివృద్ధి పేరు చెప్పి హైదరాబాద్‌లో ఎందుకు ఈ విధ్వంసఖాండను కొనసాగిస్తున్నావు. ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూనే.. ఏకంగాలక్షా 50 వేల కోట్లకు రేవంత్ రెడ్డి టెండర్ పెట్టిండు’’ అని హరీశ్ ఫైర్ అయ్యారు.
ముందు మూసీ బస్తీల్లో తిరుగు..
మూసీని బాగు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. ముందు రేవంత్ రెడ్డి మూసీ బస్తీల్లో తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవాలని హరీశ్ రావు సూచించారు. 3,279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చేందుకు సీఎం రేవంత్ గెజిట్ ఇచ్చారని, లక్షలాది మంది జీవితాలను కూల్చుతామంటున్నారని మండిపడ్డారు.
గల్ఫ్ దేశాల్లో బాంబులేస్తూ ఇండ్లను కూల్చేస్తుంటే.. ఇక్కడ ఏ యుద్ధం లేకపోయినా రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. కాగా, మూసీ ప్రక్షాళనపై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని హరీశ్రావుడిమాండ్ చేశారు. శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వస్తారని సీఎం అంటున్నారని, మూసీ పేరిట రేవంత్ చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా చెప్పాలన్నారు.
మూసీ ప్రక్షాళనకు రూ.4,100 కోట్లు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒప్పుకుని మంజూరు చేసిందంటూ గత జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చెప్పారని.. కానీ, డీపీఆర్ సమర్పించకపోవడంతో లోన్ శాంక్షన్ చేయలేదని నిరుడు డిసెంబర్ 15, ఈ ఏడాది జనవరి 23, మార్చి 11న లేఖల్లో ఏడీబీ తెలిపిందని గుర్తుచేశారు. కానీ, అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని, దీనిపై అసెంబ్లీలో ప్రివిలేజ్‌మోషన్ ఇస్తామని స్పష్టం చేశారు.
ఫిరాయింపులపై రాహుల్ స్టాండ్ ఏంటో చెప్పాలి..
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ రాహుల్ గాంధీ ఇటు పార్లమెంట్లో అటు బహిరంగ సభల్లో చెప్పారని, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారని, కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అందుకు విరుద్ధంగా సాగుతున్నదని హరీశ్ రావు విమర్శించారు.
బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్ బీఫాంపై ఓపెన్‌గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తుచేశారు. కానీ, స్పీకర్ మాత్రం ఫిరాయింపులకు ఆధారాలు లేవంటూ తీర్పునిచ్చారన్నారు. రాహుల్ చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? అని నిలదీశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే.. ఢిల్లీలో మాత్రం మీరు దానిని రక్షిస్తున్నామని చెప్పుకునే అర్హత లేదన్నారు.
