జాతీయ జెండాల  పంపిణీ షురూ

జాతీయ జెండాల  పంపిణీ షురూ

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా  జాతీయ జెండాల పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్​లోని ఎన్​బీటీ, మైథిలి నగర్​లో ఆమె జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. గ్రేటర్​లో బల్దియా తరఫున 20 లక్షల  జెండాలను అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 లక్షల జెండాలను పంపిణీ చేశామన్నారు. నెక్లెస్ ​రోడ్​లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు,  ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ ఆధ్వర్యంలో ముషీరాబాద్, భోలక్​పూర్​లో జెండాలను పంచారు. కుత్బుల్లాపూర్​లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు. మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీకారెడ్డి తార్నాకలోని తన ఇంటి వద్ద పలువురికి జెండాలను అందజేశారు. కంటోన్మెంట్ వార్డు నం.5 విక్రమ్​పురి కాలనీలో సీఈవో అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాలను పంచారు.

మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండాల పంపిణీ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. మల్కాజిగిరి, వినాయక్ నగర్ డివిజన్లలోని పలు కాలనీల్లో బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి బల్దియా అధికారులతో కలిసి జెండాలను పంచారు. బండ్లగూడ జాగీర్​లో కార్పొరేటర్ రాము ఆధ్వర్యంలో హిమాయత్​సాగర్ ఏరియాలో డ్వాక్రా మహిళలకు జెండాలను అందజేశారు. వికారాబాద్ కలెక్టరేట్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ సునీతా రెడ్డి, కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు.బీజేపీ షాద్​నగర్ సెగ్మెంట్ ఇన్​చార్జి నెల్లి శ్రీవర్ధన్​రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జెండాలు పంచారు. – వెలుగు,ముషీరాబాద్/జీడిమెట్ల/తార్నాక/మల్కాజిగిరి/ గండిపేట/వికారాబాద్/షాద్​నగర్