విమెన్‌‌ లీగ్‌‌కూ మేం రెడీ..హెచ్‌‌సీఏ ముందుకొస్తే విశాక తరఫున స్పాన్సర్‌‌‌‌షిప్: మంత్రి వివేక్

విమెన్‌‌ లీగ్‌‌కూ మేం రెడీ..హెచ్‌‌సీఏ ముందుకొస్తే విశాక తరఫున స్పాన్సర్‌‌‌‌షిప్: మంత్రి వివేక్
  • స్టేడియాల నిర్మాణానికి భూములిస్తం: పొంగులేటి  
  • కాకా కృషితోనే క్రికెట్ అభివృద్ధి: ఉత్తమ్
  • టాలెంట్ ఉన్న ప్లేయర్లకు శిక్షణనివ్వాలి: పొన్నం 
  • ప్రతిఏటా టోర్నీలు నిర్వహిస్తం: ఎంపీ వంశీకృష్ణ

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లోని టాలెంట్ ఉన్న యువతను వెలికితీసేందుకే కాకా వెంకటస్వామి క్రికెట్​టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. తన తండ్రి కాకా వెంకటస్వామికి క్రికెట్ అంటే ప్రాణమని, ఆయన స్ఫూర్తితోనే 2022 నుంచి టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం సికింద్రాబాద్‌‌లోని జింఖానా గ్రౌండ్స్‌‌లో జరిగిన కాకా టీ20 లీగ్ ముగింపు వేడుకల్లో వివేక్ మాట్లాడారు. 

“ ఈ టోర్నీలో 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ సక్సెస్ అయింది. హెచ్‌‌సీఏ వచ్చే ఏడాది మహిళలకు కూడా టోర్నీ నిర్వహిస్తే, స్సాన్సర్‌‌‌‌షిప్ చేసేందుకు విశాక ఇండస్ర్టీస్ రెడీగా ఉంది” అని ఆయన ప్రకటించారు. “ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. హెచ్‌‌సీఏ నుంచి నిధులు తక్కువ వచ్చినా డిస్ర్టిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నేతలు టోర్నీ నిర్వహణకు ఎంతో కృషి చేశారు. అపెక్స్ కౌన్సిల్‌‌లో చర్చించి డీసీఏలకు ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి” అని హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్‌‌ను కోరారు. 

‘‘జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తే, ఇంకా మంచి ప్లేయర్లు తయారవుతారు. స్టేడియాలు నిర్మించేందుకు బీసీసీఐ, హెచ్‌‌సీఏ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు ల్యాండ్ కేటాయించాలి” అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. వరంగల్, హుస్నాబాద్‌‌లో స్థలం సిద్ధంగా ఉందని.. మిగతా జిల్లాల్లోనూ కేటాయించాలన్నారు. ‘‘మన దేశంలో క్రికెట్ అభివృద్ధికి కాకా ఎంతో కృషి చేశారు. ఆనాడు ప్రధాని మన్మోహన్‌‌తో మాట్లాడి బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్‌‌ ఇప్పించారు. ఉప్పల్‌‌లో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి చొరవ తీసుకున్నారు” అని పేర్కొన్నారు.

స్టేడియాల నిర్మాణానికి భూములిస్తం: పొంగులేటి  

జిల్లాల్లో స్టేడియాల నిర్మాణానికి భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘‘తండ్రికి తగ్గ తనయుడిగా వివేక్.. ఈ టోర్నీని విజయవంతం చేశారు. జిల్లాల్లో స్టేడియాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం. హుస్నాబాద్, వరంగల్‌‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ స్టేడియాల కోసం ల్యాండ్ అలాట్ చేయడానికి రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే క్లియర్ చేస్తాం” అని హామీ ఇచ్చారు. 

టాలెంట్ ఉన్న ప్లేయర్లకు శిక్షణనివ్వాలి: పొన్నం ప్రభాకర్

ఈ టోర్నమెంట్‌‌లో మంచి ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు శిక్షణనివ్వాలని హెచ్‌‌సీఏకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వాళ్లు నేషనల్ టీమ్‌‌కు సెలెక్ట్ అయ్యేలా కృషి చేయాలన్నారు. ‘‘హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రికెట్ గ్రౌండ్‌‌కు స్థలం ఇస్తున్నాం. అక్కడ స్టేడియం నిర్మించే బాధ్యత హెచ్‌‌సీఏ తీసుకోవాలి” అని కోరారు.  

యూత్‌‌కు మంచి చాన్స్‌‌: నవీన్ యాదవ్ 

యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కొనియాడారు. గ్రామీణ యువత తమ టాలెంట్‌‌ను నిరూపించుకోవడానికి ఇలాంటి టోర్నీలు మంచి అవకాశమన్నారు. వుమెన్ క్రికెట్ టోర్నమెంట్‌‌కు కూడా స్పాన్సర్‌‌‌‌షిప్ చేస్తామని మంత్రి వివేక్ ప్రకటించడం అభినందనీయమన్నారు.

గతంలో ఇలాంటి టోర్నీల్లో ఆడే సిరాజ్, తిలక్ వర్మ లాంటి వాళ్లు నేషనల్ టీమ్‌‌కు సెలెక్ట్ అయ్యారని టీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి అన్నారు. వాళ్లను మిగతా క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ వల్ల గ్రామీణ స్థాయి  క్రీడాకారులకు మంచి అవకాశం వచ్చిందని కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్ అన్నారు. 

కాకా కృషితోనే క్రికెట్ అభివృద్ధి: ఉత్తమ్

కాకా కృషితోనే దేశంలో క్రికెట్ ఇంతలా అభివృద్ధి చెందిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘‘కాకా వెంకటస్వామి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవ వల్లే  దేశంలో క్రికెట్ ఇంతలా అభివృద్ధి చెందింది. కాకా పేరు మీద ఇంత మంచి టోర్నీ నిర్వహించడం సంతోషకరం. ఇందుకు వివేక్‌‌ను అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.  

ఏటా టోర్నీలు నిర్వహిస్తం: ఎంపీ వంశీకృష్ణ  

తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి చూపిన మార్గంలో తాను ముందుకుసాగుతున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. విశాక చారిటబుల్ ట్రస్ట్, విశాక ఇండస్ట్రీస్ ద్వారా ఏటా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ టోర్నీలో 105 మ్యాచ్‌‌లు జిల్లా స్థాయిలో జరిగాయని, ఇలాంటి టోర్నీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.