కేటీఆర్ వయసులో చిన్నోడైనా దక్షతలో అందరికంటే మిన్న

కేటీఆర్ వయసులో చిన్నోడైనా దక్షతలో అందరికంటే మిన్న
  • 19వేల పరిశ్రమలకు క్లియరెన్స్.. 
  • 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాం
  • రూ.150 కోట్లతో సింగోటం - గోపాల్దిన్నె లింక్ కెనాల్కు శంకుస్థాపన
  • మంత్రి నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్: ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈర్ష్య పడేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటవుతున్నాయని, 19 వేల పరిశ్రమలకు క్లియరెన్స్ ఇచ్చి 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంత్రి కేటీఆర్ వయసులో చిన్నవాడైనా దక్షతలో అందరికంటే మిన్న అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. కొల్లాపూర్ లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సహచర మంత్రులతో కలసి పాల్గొన్నారు. కొల్లాపూర్ రాజా బంగ్లా ప్రాంగణంలో బహిరంగ సభ మంత్రి కేటీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ రాములు , ఎమ్మెల్యేలు బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ నిజాంపాష, నాగర్ కర్నూల్ జడ్పీ ఛైర్మన్ పద్మావతి, గద్వాల జడ్పీ ఛైర్మన్ సరిత, వనపర్తి జడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి , మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు జూరాల ఎడమ కాల్వ ద్వారా క్రిష్ణానది నీరందించే సింగోటం - గోపాల్ దిన్నె లింక్ కెనాల్ కు 150 కోట్లతో  శంకుస్థాపన చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల పైబడి సాగవుతున్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్ ఒకటని వెల్లడించారు. త్వరలోనే కొల్లాపూర్ మామిడి మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన విద్య కోసం పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.