పాలసీలు తెచ్చాం..చిప్‌‌ల హబ్‌‌గా మార్చడం ఇక మీ చేతుల్లోనే!

పాలసీలు తెచ్చాం..చిప్‌‌ల హబ్‌‌గా మార్చడం ఇక మీ చేతుల్లోనే!

పాలసీలు తెచ్చాం..చిప్‌‌ల హబ్‌‌గా మార్చడం ఇక మీ చేతుల్లోనే!
కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం
దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రూ.22.8 లక్షల కోట్లకు : అశ్విని వైష్ణవ్‌‌

బెంగళూరు : సెమికండక్టర్ల తయారీని పెంచేందుకు అనువైన పాలసీలను తీసుకొచ్చామని, ఇక కంపెనీలు ముందుకొచ్చి దేశాన్ని సెమికండక్టర్ల హబ్‌‌గా మార్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.  సెమికాన్‌‌ ఇండియా–2022 కాన్ఫెరెన్స్‌‌లో మాట్లాడిన ఆయన, పై వ్యాఖ్యలు చేశారు. హై టెక్నాలజీ, హై క్వాలిటీ, హై రిలయబిలిటీ ( నమ్మకం)  పరంగా  దేశాన్ని చిప్‌‌ల తయారీకి హబ్‌‌గా నిలపాలని కోరారు.  దేశంలో బిజినెస్ పరిస్థితులను ఈజీగా మార్చేందుకు గత కొన్నేళ్ల నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో సెమికండక్టర్ల వినియోగం  2026 నాటికి  80 బిలియన్‌‌ డాలర్లకు, 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోడీ అంచనావేశారు. సెమికండక్టర్ల డిజైన్‌‌లో ట్యాలెంట్ ఉన్నవాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారని,  గ్లోబల్‌‌గా చూస్తే సెమికండక్టర్ల డిజైన్ ఇంజినీర్లలో  20 శాతం వాటా మనదేనని అన్నారు.  ‘గ్లోబల్‌‌ సెమికండక్టర్ల సప్లయ్‌‌లో దేశాన్ని కీలకమైన పార్టనర్‌‌‌‌గా మార్చడమే మన లక్ష్యంగా మారాలి’ అని  మోడీ పేర్కొన్నారు.  

‘అండ్ గేట్‌‌’ గా ఉన్నాం..
మోడీ తన స్పీచ్‌‌లో సెమికండక్టర్ ఇండస్ట్రీలో వాడే టెక్నికల్ టెర్మ్స్‌‌ను  ఉపయోగించారు.  ‘గతంలో ఇండస్ట్రీలు  పనిచేస్తామంటే ప్రభుత్వం ‘నాట్‌‌ గేట్‌‌’ గా పనిచేసింది. ఇన్‌‌పుట్‌‌కు వ్యతిరేకంగా  ‘నాట్‌‌ గేట్‌‌’  పనిచేస్తుంది. అనేక రూల్స్‌‌, ఈజ్‌‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌ లేకపోవడం...ప్రభుత్వం కచ్చితంగా ‘అండ్‌‌ గేట్‌‌’ లా ఉండాలని అర్థం చేసుకున్నాం’ అని మోడీ పేర్కొన్నారు. కాగా, సెమికండక్టర్‌‌‌‌ ఇండస్ట్రీలో ‘నాట్‌‌ గేట్‌‌’ అంటే  ఏదైనా కమాండ్‌‌కు వ్యతిరేకంగా పనిచేసేదని, ‘అండ్ గేట్‌‌’ అంటే  కలిసి పనిచేసేదని అర్థం.  పాలసీ సపోర్ట్‌‌ను అందిస్తూ  ఇండియా అంటే బిజినెస్‌‌గా మార్చామని మోడీ పేర్కొన్నారు. ‘ఇప్పుడు మీ చేతుల్లో మొత్తం ఉంది. రానున్న రోజుల్లో ఇండియాను సెమికండక్టర్ల హబ్‌‌గా మార్చడంపై మీ నుంచి సలహాల కోసం చూస్తున్నాం’ అని ఇండస్ట్రీలను ఉద్దేశిస్తూ మోడీ అన్నారు.  

చిప్‌‌ల తయారీ ప్లాంట్లు పెట్టేందుకు 5 కంపెనీలు..
ప్రస్తుతం దేశంలో 76 బిలియన్ డాలర్ల (రూ. 5.77 లక్షల కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్ తయారవుతున్నాయని, ఇంకొన్నేళ్లలో ఈ నెంబర్‌‌‌‌ 300 బిలియన్ డాలర్ల (రూ. 22.8 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని ఎలక్ట్రానిక్స్‌‌ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్‌‌‌‌ అశ్విని వైష్ణవ్‌‌ సెమికాన్‌‌–2022 కాన్ఫెరెన్స్‌‌లో పేర్కొన్నారు. ‘పెరుగుతున్న స్మార్ట్‌‌ఫోన్ల వాడకాన్ని, 5జీ ఇండస్ట్రీ పెరుగుతుండడాన్ని చూస్తుంటే రానున్న కొన్నేళ్లలో సెమికండక్టర్ల గ్రోత్ మరింత ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది’ అని అన్నారు. పీఎల్‌‌ఐ కింద దేశంలో ఎలక్ట్రానిక్ చిప్‌‌, డిస్‌‌ప్లే మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఐదు కంపెనీలు తమ ప్రపోజల్స్‌‌ను సబ్మిట్ చేశాయి. మొత్తం రూ. 1.53 లక్షల కోట్లను ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మొత్తం 100 అకాడమిక్ ఇన్‌‌స్టిట్యూషన్లు, ఆర్‌‌‌‌ అండ్ డీ ఆర్గనైజేషన్లు  5,000 మంది ప్రొఫెషనల్స్‌‌ను ట్రెయిన్ చేస్తున్నాయి. రీసెర్చ్‌‌లో 30 వేల మందిని, ఫ్లోర్ లెవెల్‌‌లో 50 వేల మందిని ట్రెయిన్ చేస్తున్నాయి. 250  సెమికండక్టర్ డిజైన్ కంపెనీలు దేశంలో పనిచేస్తున్నాయని వైష్ణవ్‌‌ అన్నారు. ప్రతీ ఏడాది 2,000 చిప్‌‌లను ఇవి డిజైన్ చేస్తున్నాయని చెప్పారు.  కాగా, పీఎల్‌‌ఐ కింద వేదాంత ఫాక్స్‌‌కాన్ జేవీ, ఐజీఎస్‌‌ఎస్‌‌ వెంచర్స్‌‌, ఐఎస్‌‌ఎంసీ కంపెనీలు చిప్‌‌ తయారీ ప్లాంట్‌‌ను పెట్టడానికి ప్రపోజల్స్‌‌ పెట్టాయి. ఈ కంపెనీలు 13.6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తాయని అంచనా. వేదాంత,  ఎలెస్టా కంపెనీలు స్మార్ట్‌‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌ల కోసం డిస్‌‌ప్లే మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను పెట్టడానికి ప్రపోజల్స్ సబ్మిట్ చేశాయి.  పీఎల్‌‌ఐ కింద ఈ కంపెనీలకు రూ. 76 వేల కోట్ల విలువైన రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇంకో 6–8 నెలల్లో ఈ కంపెనీలకు అనుమతులు ఇస్తామని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం గ్లోబల్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌లో ఇండియా వాటా కేవలం 2–3 శాతమేనని, ఈ నెంబర్‌‌‌‌ను 7–8 శాతానికి పెంచాలని ప్రధాన మంత్రి టార్గెట్‌‌గా పెట్టుకున్నారని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ సహాయ మంత్రి రాజీవ్‌‌ చంద్రశేఖర్ అన్నారు.