సింగరేణితో పలు ఒప్పందాలు చేసుకున్నాం .. గుర్తింపు కార్మిక సంఘంతో యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్

సింగరేణితో పలు ఒప్పందాలు చేసుకున్నాం .. గుర్తింపు కార్మిక సంఘంతో యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్
  • ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: హైదరాబాద్ సింగరేణి భవన్ లో సోమవారం గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్,  సింగరేణి యాజమాన్యం మధ్య 39వ స్ట్రక్చర్డ్​ మీటింగ్​జరిగింది. ఇరువర్గాల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. యాజమాన్యంతో జరిగిన సమావేశంలో కుదిరిన ఒప్పందాలు, అవగాహన అంశాల వివరాలను ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. 

150 మస్టర్ల ఆబ్సెంటిజం సర్క్యూలర్ పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా పాత విధానాన్నే కొనసాగించడానికి సింగరేణి అంగీకరించిందని చెప్పారు. సొంతింటి స్కీమ్ అమలుకు ఏర్పాటైన కమిటీలో యూనియన్ మెంబర్స్ ను కూడా తీసుకొని విధివిధానాలు నిర్ణయించి త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. 

హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తైనందున త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, గోదావరిఖనిలో క్యాథ్​ ల్యాబ్  కూడా వచ్చే నెలలోపు  ప్రారంభించేందుకు అంగీకరించిందని చెప్పారు. మెడికల్ బోర్డును యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించారన్నారు.   వచ్చే మార్చి లోపు కోలిండియా కమిటీ రిపోర్ట్ మేరకు  డిసిగ్నేషన్స్ మార్చేందుకు ఒక్కో కేసును విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.  

సీఎండీ  ఎన్ బలరాం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు శ్రీ వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ గారు, తిరుమల్ రావు, జీఎంలు, గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె. సారయ్య , కె. వీరభద్రయ్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ, వంగా వెంకట్ పాల్గొన్నారు.