కవిత చెప్పిన సర్వోదయ తెలంగాణ అంటే ఏంటీ.. !

కవిత చెప్పిన సర్వోదయ తెలంగాణ అంటే ఏంటీ.. !

హైదరాబాద్: జాగృతి చీఫ్​కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, ఏప్రిల్ 25న తన కొత్త పార్టీ పేరు, పార్టీ జెండా, పార్టీ విధివిధానాలు ప్రకటిస్తానని ఆమె తెలిపారు. సర్వోదయ తెలంగాణ నినాదమే లక్ష్యంగా తన పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారామె. దీంతో కవిత కోరుకుంటున్న సర్వోదయ తెలంగాణ అంటే ఏమిటీ అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సర్వోదయ సిద్ధాంతం.. అంటే సమాజంలో అందరి అభ్యున్నతి, సమగ్ర వికాసం. భారత జాతిపిత మహాత్మ గాంధీ ఈ సిద్ధాంతాన్ని ఆచరించేవారు. 

ఈ సిద్ధాంతం ద్వారా సమాజంలోని అట్టడుగు వ్యక్తి సహా అందరి సంక్షేమం, సమానత్వం, అహింస, స్వయంసమృద్ధిని సాధించవచ్చని ఆయన భావించేవారు. సర్వోదయ సిద్ధాంతం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావచ్చని గాంధేయవాదులు నమ్ముతారు. కవిత కూడా గాంధీ ఆచరించిన సర్వోదయ సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకుని సర్వోదయ తెలంగాణే లక్ష్యంగా తన పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. 

అంటే.. తెలంగాణలో కూడా అట్టడుగు వ్యక్తి సహా అందరి సంక్షేమం అందాలని, స్వయంసమృద్ధి సాధించాలనేది ఆమె ప్రధాన ఉద్దేశం. ఎవరెంతో వారికి అంతే.. అంటే జనాభాలో ఎంత శాతం ఉంటే అంత వాటా (రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో) దక్కాలనేది ఆమె ఉద్దేశం. కవిత ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగా చెప్పారు. మనం భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం.. కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేదన్నారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏండ్లు గడిచినా రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాన్ని సంపూర్ణంగా సాధించుకోలేకపోయామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమె ఈ కామెంట్ చేశారు. అంటే.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాధించుకున్నాం.. కానీ రాష్ట్రంలో సామాజిక మార్పు రాలేదని.. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగలేదన్నది కవిత వాదన. 

ఇప్పటికీ నీళ్ల వాటాలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేదు. అలాగే, తెలంగాణ సమాజంలో మెజార్టీ వర్గమైన బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి దక్కాల్సిన వాటా దక్కలేదు. దీంతోనే.. సర్వోదయ తెలంగాణే లక్ష్యంగా కొత్త పార్టీ స్థాపిస్తున్నట్లు కవిత తన వైఖరిని ప్రకటించారు.

ALSO READ : ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తా.. సర్వోదయ తెలంగాణ కోసం ఉద్యమిస్తా : కవిత