హైదరాబాద్: తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో రాష్ట్ర రాజకీయాలు మారుస్తానని జాగృతి చీఫ్కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ రామ నవమి సందర్భంగా శుక్రవారం (మార్చి 27) కవిత నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తి రావాలని.. సర్వోదయ తెలంగాణ సాధన కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాధించి పన్నెండేళ్లు దాటింది. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించుకోలేకపోయామన్నారు. ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ రావాలని బలంగా కోరుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే 2026, ఏప్రిల్ 25న తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపారు. ఆ రోజు బలమైన ముహూర్తం ఉందన్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు.
శ్రీ రామ చంద్రుడి దయతోనే అందరి జీవితంలో కొత్త పార్టీ వెలుగులు నింపుతుందని అన్నారు. పార్టీ ప్రకటన ముందు వారణాసి వెళ్లి గంగ స్నానం, శివుడికి అభిషేకం చేస్తామని తెలిపారు. యువతకు మా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా ఆడ బిడ్డలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఏప్రియల్ 25న కొత్త పార్టీ ప్రకటన రోజు తరలిరావాలని పిలుపునిచ్చారు.
