మా పేర్లు లేకుంటే శిలాఫలకాలు కూల్చేస్తాం : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

మా పేర్లు లేకుంటే శిలాఫలకాలు కూల్చేస్తాం : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
  • బీజేపీ కార్యకర్తలపై దాడులు సిగ్గుచేటు

వికారాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధ్వాన్నంగా తయారైందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్​ హౌస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో శిలాఫలకాలపై తన పేరును ఎక్కడో మూలకు పెట్టడం సరికాదన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి వస్తే శిలాఫలకాలను తామే కూలగొడతామని హెచ్చరించారు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు మంచి పేరుందని, ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బీజేపీకి చెందిన సర్పంచులపై కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే ఇస్తోందన్నారు. కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శిలాఫలకాలు వేసుకుంటోందని ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులు చేసి, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, కౌన్సిలర్ అనిల్ యాదవ్, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు వికారాబాద్ డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.