కోల్బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి వ్యాప్తంగా కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సింగరేణి బ్రాంచి) ఆధ్వర్యంలో అధికారులు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ఏరియాల్లోని జీఎం ఆఫీసుల ఎదుట దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం ఏరియాల ప్రెసిడెంట్లు ఎస్.రమేశ్, మహేశ్మాట్లాడుతూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యంలో చలనం లేకపోవడంతోనే దీక్షలకు పూనుకున్నట్లు చెప్పారు.
రెండేండ్ల పీఆర్పీలు చెల్లించకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని మండిపడ్డారు.పే అప్గ్రెడేషన్, పదోన్నతి పాలసీ రూపొందించి వెంటనే అమలు చేయాలని, పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి కంపెనీకి రావాల్సిన రూ.50వేల కోట్ల బకాయిలు చెల్లించాలని, అధికారుల క్వార్టర్లకు ఉచిత కరంట్, అధికారుల పిల్లలు ఐఐటీ వంటి కోర్సుల్లో చేరితే ఫీజు రీయిబర్స్మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సంఘం వైస్ ప్రెసిడెంట్ వర్ధన్, జాయింట్ సెక్రెటరీ సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖనిలో నిరాహార దీక్ష
గోదావరిఖని: కోల్ ఇండియాతో సమానంగా సింగరేణి అధికారులకు పీఆర్పీ బకాయిలు, వేతన సవరణ, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంవోఏఐ, సింగరేణి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా ఆఫీసర్లు గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. సీఎంవోఏఐ ఆర్జీ-1 ఏరియా ప్రధాన కార్యదర్శి మల్లేశం, యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణుమూర్తి తదితరులు దీక్ష చేయగా, సీఐటీయూ ప్రెసిడెంట్రాజారెడ్డి, మెండె శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆఫీసర్ల సంఘం లీడర్లు మాట్లాడుతూ 2022-- నుంచి పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కోల్ ఇండియాలో అమలు చేసిన విధంగా సింగరేణి అధికారులకు పే అప్‌గ్రేడ్ చేయాలని, కోల్ ఇండియా అధికారులతో సమానంగా అన్ని అలవెన్సులు, ప్రయోజనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. యైటింక్లయిన్ కాలనీలో ఆర్జీ 2 జీఎం ఆఫీస్వద్ద, సెంటినరీ కాలనీలో ఆర్జీ 3 జీఎం ఆఫీస్ వద్ద పలువురు ఆఫీసర్లు నిరాహారదీక్ష చేపట్టగా వారికి పలువురు మద్దతు తెలిపారు.
