
న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2025, సెప్టెంబర్ 23 నుంచి కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై వాదనలు వినిపించేందుకు ట్రిబ్యునల్ మూడు రోజుల సమయం ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ తుది వాదనలు వినిపించేందుకు ఢిల్లీకి వచ్చామని చెప్పారు. 2025, ఫిబ్రవరి నుంచి ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణ వాదనలు వినిపిస్తున్నామని.. వాదనలు ఇప్పుడు చివరి దశకు వచ్చాయని తెలిపారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి ట్రిబ్యునల్ ముందు వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపారు. కృష్ణాలో నికర జలాలైనా.. మిగులు జలాలైన, వరద జలాలైన.. ఒక్క చుక్కను వదులుకోమని తేల్చి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం మేం పోరాటం చేస్తున్నామని.. తెలంగాణలో కృష్ణ ప్రవాహం, క్చాచ్ మెంట్ ఏరియా, పాపులేషన్ వీటంన్నిటిని పరిగణలోకి తీసుకుని మా వాటా నిర్ణయించాలన్నారు. కృష్ణా జలాల్లో 70 శాతం నీటి వాటా కేటాయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కృష్ణాజిల్లాలో తెలంగాణకు 555 టీఎంసీల కేటాయించాల్సిందేనని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మేం ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. అందుకే ఫైల్ రీఓపెన్ చేసి మొదటినుంచి వాదనలను వినిపిస్తున్నామని తెలిపారు.