బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తాం.. స్థానిక ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తాం.. స్థానిక ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై బుధవారం (అక్టోబర్ 8) హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగ విరుద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించిందన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తామని.. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

షెడ్యూల్ ప్రకారం.. గురువారం (అక్టోబర్ 9) ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాగుతుందన్నారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కుల గణన జరిగిందని.. బీసీల నోటి కాడి ముద్దును బీజేపీ లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీ బిల్లులకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.