ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
  • దేశంలోరెండు చోట్ల మాత్రమే క్యాత్ ల్యాబ్, రేడియో థెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ సదుపాయాలు

హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. కార్మిక ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగామగంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ తొలి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ డే ఉత్సవాలకు సహచర మంత్రి కిషన్ రెడ్డితో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ ఈఎస్ఐ చారిటీ కాదు.. ప్రతి కార్మికునికి ఒక అండ అని.. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నాచారం, రామచంద్రపురంలో ఆస్పత్రులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి, రామగుండం, శంషాబాద్ లలో 100 పడకల కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి వెల్లడించారు. 

వైద్య వృత్తి అమూల్యమైనది... ఆకాశమే హద్దు

వైద్య వృత్తి అమూల్య మైనదని, దేశానికి భవిష్యత్ మీరు.. మీకు ఆకాశమే హద్దు..ఇక్కడున్న డాక్టర్లను చూస్తుంటే గర్వంగా ఉంది..’ అని మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే క్యాత్ ల్యాబ్, రేడియో థెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ సదుపాయాలు ఉండగా.. ఇందులో ఒకటి హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ అని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. నేను ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యాను.. కానీ యువతతో ఇంటరాక్ట్ అయినప్పుడు రెట్టింపు సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువ వైద్యుల చేతుల్లోనే ఉందని.. ప్రజలకు నేరుగా సేవ చేసే అద్భుతమైన అవకాశం ఒక్క డాక్టర్లకే దక్కిందన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన కష్ట కాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది ధైర్యంగా తఅందించిన సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని ఆయన అభినందించారు. ఈఎస్ఐ ద్వారా చాలా మంది సభ్యులు లబ్ది పొందుతున్నారని.. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఎక్కడా లేనన్ని ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని వివరించారు. నరేంద్ర మోడీ తలపెట్టిన ఆత్మ నిర్బర్ భారత్ కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపేందర్ యాదవ్ కోరారు.