ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ .. నినాదంతో జనంలోకి వెళ్తం : కిషన్​రెడ్డి

 ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్  .. నినాదంతో జనంలోకి వెళ్తం : కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారభేరీ మోగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి శక్తిని కేంద్రీకరించి రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా పనిచేస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలపై సోమవారం మీడియా సమావేశంలో వివరించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణకు అవసరం లేదని తెలిపారు. ఈ నెలలోనే రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. 

ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్ ఓపెనింగ్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో  ప్రధాని పాల్గొననున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ పూర్తి స్థాయిలో కార్యాచరణను ఈ సమావేశాల్లో ఫైనల్ చేసిందన్నారు. 90 శాతం కొత్త ఓటర్లు మోదీకి అండగా ఉన్నారని, వారిని నేరుగా కలుస్తామన్నారు. రాష్ట్రంలోని17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్​చార్జులను నియమించామని, త్వరలో కన్వీనర్లను ప్రకటిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడ ఒకటిగా ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘హనుమాన్’ కొత్త సినిమా వాళ్లు టికెట్ పై 5 రూపాయలను రాముడు కోసం ఖర్చు చేస్తామని ప్రకటించడం సంతోషమన్నారు. 

పార్టీలో చేరికలు

పార్టీ స్టేట్ ఆఫీసులో కిషన్​ రెడ్డి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల నేతలు పలువురు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ యాక్టర్, ప్రొడ్యూసర్ అభినవ్ కేతావత్ (అభినవ్ సర్ధార్), వారి అనుచరులకు, హైదరాబాద్ సిటీకి చెందిన ఆప్ నేత హరిచరణ్, ఆయన అనుచరులకు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని, మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. ప్రాంతీయ, కుటుంబ అవినీతి పార్టీలు ఫ్రంట్ పెట్టి పగటి కలలుకంటున్నాయని, కాంగ్రెస్​ నేతృత్వంలోని ఇండియా కూటమిని దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు.