- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్
న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. పేపర్ లీక్ రాకెట్లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.
Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf
— Narendra Modi (@narendramodi) July 30, 2026
వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ అనేదీ దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు.దీని వల్ల దేశంలోని కోట్లాది మంది యువతీ యువకుల భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలోకి కూరుకుపోతున్నదని తెలిపారు.
పరీక్షా ప్రక్రియను మరింత పటిష్టం చేయడానికి, భవిష్యత్తులో లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. వ్యవస్థలో అవసరమైన మార్పులతో పాటు టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
పరీక్షా విధానంలో సంస్కరణలు తేవడం, ఫాస్ట్ ట్రాక్ పద్ధతులను అమలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దేశంలోని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ మాఫియాను, అక్రమ ముఠాలను ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.
పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయని మోదీ గుర్తుచేశారు. ఇది పరీక్షా విధానాన్ని సంస్కరించే దిశలో కీలక మైలురాయి అని పేర్కొన్నారు.
