- ఐదేండ్లలో పని పూర్తి చేస్తం
- అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్‌కు శంకుస్థాపన
గువాహటి: దేశం నుంచి నక్సలిజాన్ని తొలగిస్తున్నట్టే..త్వరలో చొరబాటుదారుల( ఇన్‌ఫిల్ట్రేటర్లు)నూ ఏరివేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఐదేండ్లలో అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి మాత్రమే కాకుండా దేశం నుంచీ తొలగిస్తామని ప్రకటించారు. శనివారం ఆయన అస్సాంలో పర్యటించారు. కామ్‌రూప్‌లో పోలీస్ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ.."చొరబాటుదారులు ఆక్రమించిన స్థలాన్ని వారి చెర నుంచి విడిపించాం. ఇప్పుడు అదే స్థలంలో కొత్త పోలీస్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నాం. అస్సాంలో చొరబాటుదారులను తొలగిస్తామని రాహుల్ గాంధీ గతంలో హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎందుకంటే అక్రమ వలసదారులే కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ గా మారింది. ఎన్నికల సంఘం ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారులను గుర్తిస్తోంది. కానీ రాహుల్ గాంధీ దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయినా, అస్సాంలో సర్ ప్రాసెస్ కొనసాగుతున్నది.
కాంగ్రెస్ విధానాల వల్ల అస్సాం జాతికి (ప్రజలు), మట్టికి (భూమి), బేతి (పునాది)లకు ముప్పు ఏర్పడింది. నిజంగా చొరబాటుదారులను దేశం నుంచి తరిమేయాలని కాంగ్రెస్ కోరుకుంటే.. త్వరలో అస్సాంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తయారు చేసే మేనిఫెస్టోలో రాహుల్ ఆ అంశాన్ని చేర్చాలి. ఇదే నా సవాల్. కాంగ్రెస్ వల్లే ధుబ్రి, బర్పేటా, డర్రాంగ్, మొరిగావ్, బొంగైగావ్, నగావ్, గోల్‌పారా జిల్లాలు ముస్లిం ఆధిపత్యంలోకి వెళ్లాయి.
కాంగ్రెస్ పాపం నుంచి అస్సాం అనుభవిస్తున్న ఈ బాధ నుంచి బీజేపీ విముక్తి చేస్తుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తేనే ఇన్‌ఫిల్ట్రేటర్లను తరిమేయగలం. గత పదేండ్ల బీజేపీ పాలన వల్ల అస్సాంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని పేదరికం, నిరుద్యోగం, వరదల నుంచి విముక్తి చేస్తున్నది" అని పేర్కొన్నారు.
