ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేస్తం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేస్తం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ గురుకులాలకు పర్మినెంట్‌గా బిల్డింగ్‌లు నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న పాత భవనాలకు రిపేర్లు చేయిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. విద్యా, సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా ఆఫీసర్లంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు ఇది ఒక ముందడుగని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ నిధుల విషయంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

గురుకులాల్లో డ్రాప్‌ అవుట్లు తగ్గించాలి..

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో డ్రాప్‌ అవుట్స్ లేకుండా చూసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను మంత్రి లక్ష్మణ్‌ ఆదేశించారు. డ్రాప్‌ అవుట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెంటర్‌షిప్, కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. గతేడాది అధిక ఫలితాలు సాధించిన గురుకులాలను మోడల్ ఇన్‌స్టిట్యూట్లుగా అభివృద్ధి చేసి, ఇతర స్కూల్స్‌కు ఆదర్శంగా నిలపాలన్నారు. 

విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ యాక్సెస్‌పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. జేఈఈ, ఐఐటీ, నీట్, యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వంటి ఉన్నత విద్య, జాతీయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. శాస్త్ర సాంకేతికతను వినియోగించి డిజిటల్ మానిటరింగ్ చేయాలన్నారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్లు తీసుకున్న పథకాలను పేద ప్రజలకు సులభంగా చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.