రెండ్రోజుల్లో పెండ్లి.. వరుడి తల్లి హత్య..కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన

రెండ్రోజుల్లో పెండ్లి.. వరుడి తల్లి హత్య..కరీంనగర్ జిల్లా రామడుగులో ఘటన
  • గొంతుకోసి హతమార్చిన దుండగులు..చిన్నకొడుకుపై అనుమానం?

రామడుగు, వెలుగు: మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. బాజాభజంత్రీలతో సందడిగా ఉండాల్సిన ఇంట్లో మహిళ హత్యకు గురికావడం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలానికి చెందిన ఈరెళ్లి గౌరమ్మ(65), కొమురయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు మహేశ్, అనిల్ ఉన్నారు.

పెద్దకొడుకు మహేశ్​ ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 8న మహేశ్​ వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కోసం బట్టలు కొనేందుకు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మహేశ్​ కరీంనగర్ వెళ్లాడు. భర్త కొమురయ్య కులస్తుల వివాహానికి వెళ్లాడు. ఇంట్లో గౌరమ్మ ఒక్కరే ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో మెడ కోసి హత్య చేసి పరారయ్యారు.

కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కొమురయ్య.. భార్య రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాకయ్యాడు. సంఘటనా స్థలాన్ని చొప్పదండి సీఐ ప్రదీప్‌‌కుమార్, రామడుగు ఎస్సై రాజు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌‌తో తనిఖీలు చేపట్టారు. హత్య తీరును పరిశీలిస్తే కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువుల ప్రమేయం ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల అదుపులో చిన్న కొడుకు?

ఈ ఘటన అనంతరం గౌరమ్మ చిన్నకొడుకు అనిల్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతున్నదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై రాజు తెలిపారు. గౌరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ సివిల్ హాస్పిటల్​కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.