
సాధారణంగా వీకెండ్‌లో రెండు మూడు.. లేదంటే నాలుగైదు.. అదీ కాదంటే ఏడెనిమిది సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. కానీ ఈసారి కొత్తవి, పాతవి కలిసి ఇరవై వరకు వస్తున్నాయంటే ఓటీటీల జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో మన ఇండియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు రెండున్నాయి. ఒకటి ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’, రెండోది విద్యాబాలన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘షేర్‌నీ’. ‘మారి’ చిత్రం తర్వాత ధనుష్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటించిన చిత్రం ‘జగమే తంత్రం’ ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతోంది. నూట తొంభై దేశాల్లో పదిహేడు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఇక విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటించిన ‘షేర్‌నీ’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు అందరినీ ఇంప్రెస్ చేయడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లిష్ మూవీ ‘ఫాదర్‌హుడ్’ నెట్‌ఫ్లిక్స్‌లో, యానిమేషన్ ఫిల్మ్ ‘లూకా’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కాబోతున్నాయి. రెండు జపనీస్ చిత్రాలు కూడా ఈవారం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్నాయి. ‘రురోనీ కెన్‌షిన్: ద ఫైనల్’ నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. ‘ఎ ఫ్యామిలీ’ని నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తోంది. ‘కాయంకులమ్ కొచున్ని’, ‘కుమార సంభవం’ అనే మలయాళ చిత్రాలు జియో సినిమాలో స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి. ఈవారం బుక్ మై షో కూడా జోరు పెంచింది. స్లొవేకియన్ మూవీ ‘స్కమ్‌బ్యాగ్’తో పాటు ఇంగ్లిష్ సినిమాలు ద ట్రూ అడ్వెంచర్స్ ఆఫ్ ఉల్ఫ్ బోయ్, అఫీషియల్ సీక్రెట్స్‌ని కూడా ఇవాళ ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ‘ఇట్ కేమ్ ఫ్రమ్ ద డిజర్ట్’ మూవీకి హిందీ వెర్షన్‌ని కూడా నేటి నుంచి స్ట్రీమ్ చేయనుంది. ఈ సినిమాలతో పోటీపడుతూ కొన్ని వెబ్ సిరీసులు కూడా వచ్చేస్తున్నాయి. ప్రియదర్శి, నందినీరాయ్ నటించిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ సిరీస్ చాలా అంచనాలతో ఆహాలో రిలీజవుతోంది. బెంగాలీ సిరీస్ ‘మోచక్’ హోచో ప్లాట్‌ఫామ్‌లోను, చైనీస్ సిరీస్ ‘ద రేషనల్ లైఫ్’ నెట్‌ఫ్లిక్స్‌లోను స్ట్రీమ్ కానున్నాయి. వీటితో పాటు ట్రావెల్ సిరీస్ ‘ద వరల్డ్స్ మోస్ట్ అమేజింగ్ వెకేషన్ రెంటల్స్’ (నెట్‌ఫ్లిక్స్), ఫిట్‌నెస్ సిరీస్ ‘ఫిజికల్’ (యాపిల్ టీవీ), ల్యాటిన్ అమెరికన్ ఫుట్‌బాల్ డాక్యుమెంటరీ సిరీస్ ‘చివాస్’ సీజన్ 1 (అమెజాన్ ప్రైమ్), ఫుట్‌బాల్ ప్లేయర్ జీవితాన్ని చూపించే స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్ ఎల్ కోరజోన్ డి సెర్జియో రామోస్ (అమెజాన్ ప్రైమ్) కూడా ఇవాళ్టి నుంచి స్ట్రీమ్ కానున్నాయి. మొత్తంగా ఈవారం అన్ని ఓటీటీలూ రకరకాల కంటెంట్‌తో రెడీ అయిపోయాయి. ప్రేక్షకులు చూడటమే తరువాయి.