- లావీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
- 81 ఎకరాల కేటాయింపు.. 2 వేల మందికి పైగా ఉపాధి
- ఐకానిక్ కేటగిరీ కింద భారీగా రాయితీలు
- 66 ఏళ్ల కాలానికి ప్రభుత్వానికి రూ.1,204 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిట్రీట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 'లావీ వెల్నెస్ రిట్రీట్' పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ , బంధ సంస్థ 'కేమలాట్ రిట్రీట్స్ ప్రైవేట్ లిమిటెడ్' రూ.1,021 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
పర్యాటక, సాంస్కృతిక శాఖ నేడో రేపో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రాజెక్టు కోసం 81 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ పర్యాటక విధానం 2025-–30'లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఐకానిక్ కేటగిరీ' కింద గుర్తించింది.
దావోస్ వేదికగా పునాది..
2025 జనవరి 21న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం, మేఘా సంస్థ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రాజెక్టుకు మొత్తం రూ.1,021 కోట్లు కాగా.. మొదటి దశలో రూ.571.40 కోట్లు వెచ్చించనున్నారు. అనంతగిరిలో 81 ఎకరాల భూమిని ప్రాథమికంగా 66 ఏళ్ల పాటు లీజుకు అప్పగించనున్నారు.
పర్యాటక నిబంధనలకు లోబడి దీనిని మరో 33 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 99 ఏళ్లు ఆ సంస్థ ఆధీనంలోనే ప్రాజెక్టు కొనసాగుతుంది. దీని వల్ల 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం కామెలాట్ రిట్రీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక విభాగం (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. ఒప్పందం కుదిరిన రెండేళ్లలోపు మొదటి దశ పనులను పూర్తి చేయాలి.
ప్రభుత్వానికి భారీ ఆదాయం..
గతంలో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఆదాయ వాటాను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంస్థ అంగీకరించింది. 4వ ఏడాది నుంచి 13వ ఏడాది వరకు స్థూల ఆదాయంలో 2% వాటా. 14వ ఏడాది నుంచి 66వ ఏడాది వరకు స్థూల ఆదాయంలో 3% వాటా. మొత్తం 66 ఏళ్లలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా లీజు, ఆదాయ వాటా రూపంలో సుమారు రూ.1,204 కోట్ల రాబడిని అంచనా వేస్తోంది.
ఐకానిక్ హోదా..
కొత్త పర్యాటక విధానంలో ఈ ప్రాజెక్టుకు ఐకానిక్ కేటగిరీ కింద ప్రత్యేక రాయితీలు కల్పించారు. 15ఏళ్ల పాటు 100 శాతం నెట్ ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. 10 ఏళ్ల పాటు టర్మ్ లోన్లపై 3% వడ్డీ రాయితీ, 15 ఏళ్ల పాటు యూనిట్‌కు రూ.3.00 చొప్పున పవర్ టారిఫ్ సబ్సిడీ, భూమి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్ వంటి పలు రాయితీలు కల్పించారు.
రాయితీతోపాటు ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా విధించింది. మేఘా సంస్థ ఈ ప్రత్యేక విభాగంలో కనీసం 51% వాటాను కలిగి ఉండాలి. ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాదిలోపు కేంద్ర పర్యాటక శాఖ నుంచి 5 స్టార్ డీలక్స్ రేటింగ్ పొందాల్సి ఉంటుంది. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆఫీసర్లు పేర్కొన్నారు.
విహార యాత్రతోపాటు ఆరోగ్యధామంగా..
వెల్నెస్ రిట్రీట్ కేవలం విహారయాత్ర మాత్రమే కాదు.. ఇది మన శరీరం, మనస్సు, ఆత్మను పునరుద్ధరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేకమైన కేంద్రం. సాధారణంగా మనం వెళ్లే రిసార్టులలో వినోదం, ఆహారంపై దృష్టి పెడతాం. కానీ, వెల్నెస్ రిట్రీట్‌లో సంపూర్ణ ఆరోగ్యం ప్రధాన లక్ష్యం. ప్రశాంతమైన వాతావరణంలో నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి ప్రత్యేక హాళ్లు లేదా ఓపెన్-ఎయిర్ డెక్స్ నిర్మించనున్నారు.
స్పా, థెరపీ సెంటర్లు, కేరళ తరహా ఆయుర్వేద మసాజ్‌లు, పంచకర్మ చికిత్సలు, ప్రకృతి సిద్ధమైన మట్టి స్నానం, హైడ్రోథెరపీ (నీటి చికిత్స), స్వీడిష్ థెరపీ వంటివి ఒత్తిడి తగ్గించడానికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. ఇక్కడ సాధారణ హోటల్ ఫుడ్ ఉండదు. పర్యాటకుల శరీర తత్వానికి తగ్గట్టుగా పోషకాహారం, జ్యూస్‌లు, సేంద్రియ పద్ధతిలో పండించిన
కూరగాయలతో భోజనం అందించనున్నారు.
పర్యావరణహితంగా..
అనంతగిరి కొండలు అడవులకు ప్రసిద్ధి. కాబట్టి పచ్చని చెట్ల మధ్య నడక, పక్షులను వీక్షించడం వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. నిపుణులైన వైద్యులు, సైకాలజిస్టులు పర్యాటకులతో మాట్లాడి, వారి ఒత్తిడికి గల కారణాలను విశ్లేషించి.. తిరిగి వెళ్లేటప్పుడు అనుసరించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు.
ఇది 5 స్టార్ డీలక్స్ రేటింగ్ పొందే ప్రాజెక్టు కాబట్టి, బస చేసే గదులు అత్యంత విలాసవంతంగా, పర్యావరణ హితంగా నిర్మించనున్నారు. గదుల నుంచే ప్రకృతి అందాలను చూసేలా వీటిని డిజైన్ చేయనున్నారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండి కూడా, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, తక్కువ ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉంటాయి. రూ.1,021 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే, ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒన్ స్టాప్ హెల్త్ డెస్టినేషన్ గా మారబోతోంది.
