అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి అభిషేక్ ఇంట్లో పోలీసుల సోదాలు

అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి అభిషేక్ ఇంట్లో పోలీసుల సోదాలు

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్‌‌‌‌ బెనర్జీ శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్, భూ కబ్జా కేసుల్లో నిందితుడైన అభిషేక్ పీఏ సుమిత్ రాయ్ పరారీలో ఉన్నాడు. అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్ చివరిగా అభిషేక్ బెనర్జీ ఇంట్లోనే చూపించడంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. పశ్చిమ మేదినీపూర్‌‌‌‌కు చెందిన పోలీస్ బృందం.. కోల్‌‌‌‌కతా పోలీసులు, కేంద్ర బలగాల సహాయంతో అర్ధరాత్రి 2 గంటలకు కాళీఘాట్ లోని అభిషేక్ నివాసానికి చేరుకుంది. 

ఈ విషయం తెలియగానే మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెంటనే అభిషేక్ ఇంటికి చేరుకున్నారు. సోదాలు ముగిసి పోలీసులు వెళ్లేవరకు ఆమె అక్కడే ఉన్నారు. సల్బోని ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న సుమిత్ రాయ్  కోసం తాము గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్‌‌‌‌ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. 

కాగా.. మున్సిపల్ రిక్రూట్ మెంట్ స్కామ్ కేసులో కమర్‌‌‌‌హతి టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా ఇండ్లల్లో ఈడీ దాడులు చేపట్టింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ కోల్‌‌‌‌కతాలోని మిత్రా భవానీపూర్ నివాసంతో పాటు నగర ఉత్తర సరిహద్దుల్లోని దక్షిణేశ్వర్‌‌‌‌లోని ఐదంతస్తుల అపార్ట్‌‌‌‌మెంట్, కోల్‌‌‌‌కతా దక్షిణ శివార్లలో ఉన్న జోకాలోని ఒక ఫ్లాట్‌‌‌‌లో సోదాలు చేసింది. 

వివిధ మున్సిపాలిటీలలోని పలు పోస్టులకు అనర్హులైన అభ్యర్థులను నియమించడానికి సంబంధించి మిత్రా.. లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.