‘సర్’లో జ్యుడీషియరీకి చోటివ్వండి: కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

‘సర్’లో జ్యుడీషియరీకి చోటివ్వండి: కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల సవరణ ప్రక్రియ, సర్) నిర్వహణలో జ్యుడీషియల్ అధికారులకు చోటివ్వాలని కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్  ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సూచించింది. సర్ పై వచ్చిన ఆరోపణలు, అభ్యంతరాలను జ్యుడీషియల్ ఆఫీసర్లు పరిశీలిస్తారని తెలిపింది. 

జ్యుడీషియల్  అధికారుల్లో మాజీ జిల్లా జడ్జీలతో పాటు సర్వింగ్  జిల్లా జడ్జీలు కూడా ఉండాలని పేర్కొంది. ఈమేరకు సీజేఐ జస్టిస్  సూర్యకాంత్, జస్టిస్  జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్  విపుల్ ఎం పంచోలితో కూడిన బెంచ్  ఈ ఆదేశాలు  జారీ చేసింది. సర్ విషయంలో బెంగాల్  ప్రభుత్వం, ఎలక్షన్  కమిషన్  ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం దురదృష్టకరమని బెంచ్ వ్యాఖ్యానించింది.

‘‘రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు (బెంగాల్  ప్రభుత్వం, ఈసీ) బ్లేమ్ గేమ్  ఆడుతున్నాయి. దీంతో వాటి మధ్య సయోధ్య కుదరడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సర్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది” అని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్  సూర్యకాంత్  అన్నారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల తాము అసాధారణ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తున్నదని ఆయన తెలిపారు. జ్యుడీషియల్ ఆఫీసర్ల విధివిధానాలను ఖరారు చేసేందుకు కలకత్తా హైకోర్టు చీఫ్  జస్టిస్ తో బెంగాల్  ఎన్నికల కమిషనర్, చీఫ్​ సెక్రటరీ, పోలీస్ చీఫ్, ఇతర ఉన్నతాధికారులు శనివారం సమావేశం కావాలని బెంచ్  సూచించింది.

‘‘ఎస్డీఓ, ఎస్డీఎం విధులు నిర్వర్తించేందుకు గ్రూప్​ఏ అధికారులను సమకూర్చే బాధ్యత రాష్ట్రానిదే. అయితే.. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన అధికారుల హోదాలపై వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈసీ తరలించిన, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన అధికారుల ర్యాంకు, స్టేటస్ ను నిర్ధారించడం సుప్రీంకోర్టుకు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏడీజే లేదా జిల్లా జడ్జీల ర్యాంకుతో సమానంగా జ్యుడీషియల్  మాజీ అధికారులను నియమించాలని కల్ కత్తా హైకోర్టు సూచించడం మినహా మాకు మరో ఆప్షన్  లేదు. ఓటర్ల లిస్టులో తేడాలను ఆ జ్యుడీషియల్  మాజీ అధికారులు తేలుస్తారు” అని బెంచ్ వ్యాఖ్యానించింది.