వెస్టిండీస్ అదే తీరు..తొలి వన్డేలో పాక్ చేతిలో ఓటమి

వెస్టిండీస్ అదే తీరు..తొలి వన్డేలో పాక్ చేతిలో ఓటమి

తరౌబా:  సొంతగడ్డపై వెస్టిండీస్ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌ టీ20 సిరీస్ కోల్పోయిన కరీబియన్ టీమ్ వన్డే సిరీస్‌నూ ఓటమితో ఆరంభించింది. అరంగేట్రం ప్లేయర్ హసన్ నవాజ్ (54  బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో63 నాటౌట్‌‌) అజేయ ఫిఫ్టీతో సత్తా చాటడంతో శుక్రవారం రాత్రి  బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో పాక్  ఐదు వికెట్ల తేడాతో విండీస్‌‌ను  ఓడించింది. 

దాంతో మూడు వన్డేల సిరీస్‌‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.  టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన కరీబియన్ టీమ్ తొలుత 49 ఓవర్లలో 280 రన్స్‌‌కు ఆలౌటైంది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ (4) నిరాశ పరిచినా.. ఎవిన్ లూయిస్ (60), కెప్టెన్ షై హోప్ (55),  రోస్టన్ ఛేజ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో గుడకేశ్ మోతీ (31) కూడా ఆకట్టుకున్నాడు.  పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు.  

అనంతరం ఛేజింగ్‌‌లో పాకిస్తాన్ 48.5 ఓవర్లలో 284/5 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మహ్మద్ రిజ్వాన్ (53), బాబర్ ఆజమ్ (47) విజయానికి  పునాది వేయగా.. చివర్లో హసన్ నవాజ్ వేగంగా ఆడి జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్‌‌‌‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.