కరోనా కంట్రోల్‌‌కు ఏం చేస్తున్నరు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

కరోనా కంట్రోల్‌‌కు ఏం చేస్తున్నరు? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

నేడు సమగ్ర వివరాలతో రండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సభలు, సమావేశాలకు అనుమతిపై సమీక్షించాలి 

నిందితులు, సాక్షుల హాజరు విషయంలో కఠినంగా ఉండొద్దు  

కక్షిదారులు కోర్టులకు రాకుండా చూడాలి

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా వైరస్ నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి సమగ్ర వివరాలను గురువారం తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హోలీ వేడుకలను నిషేధించేలా ఆర్డర్‌‌ ఇవ్వాలని హైదరాబాద్‌‌కు చెందిన జి.సిద్ధలక్ష్మి వేసిన పిల్‌‌పై బెంచ్ బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు లాయర్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ… హోలీ వేడుకల్లో ప్రజలందరూ ఒక్క దగ్గర గుమిగూడితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హోలీ నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ… హోలీ లాంటి వేడుకలను ఎలా నిషేధిస్తామని ప్రశ్నించింది. హోలీ నాడు 144 సెక్షన్‌‌ విధించలేమని పేర్కొంది. ప్రజలను చైతన్యపరిచేలా ప్రభుత్వం, వివిధ సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రజలే సొంతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని, బాధితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్‌‌ లాయర్‌‌ నిరంజన్‌‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పారు. ఇది పెళ్లిళ్ల సీజన్‌‌ కావడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడే అవకాశాలు ఉన్నాయని, అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. వాదనలు విన్న బెంచ్ పూర్తి వివరాలతో రావాలని విచారణను గురువారానికి వాయిదా వేసింది. విద్యా సంస్థలు, జైళ్లు, కోర్టుల్లో తీసుకుంటున్న ముందస్తు చర్యలను తెలియజేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే…

కరోనా నియంత్రణలో భాగంగా జనం గుంపులు గుంపులుగా ఒక దగ్గర చేరకుండా ఉండేందుకు హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే…  

మీటింగ్‌‌లు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతులపై పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇప్పటికే ఇచ్చిన పర్మిషన్లపై పున:సమీక్ష చేయాలి. భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే సంస్థలపై ఆంక్షలు విధించాలి.

మరోవైపు కింది కోర్టులకు విధిగా హాజరు కావాల్సిన వాళ్లు రాకపోతే మేజిస్ట్రేట్‌‌ సానుకూలంగా ఉండాలి. నిందితులు, సాక్షుల విషయంలో కఠినంగా వ్యవహరించొద్దు.

కక్షిదారులు కోర్టులకు రాకుండా లాయర్లు చర్యలు తీసుకోవాలి.

ఖైదీల విషయంలోనూ జైళ్ల శాఖ ఐజీ చర్యలు తీసుకోవాలి. వైరస్‌‌ సొకినట్లు అనుమానం వస్తే ప్రత్యేక వార్డుల్లో ఉండేలా చర్యలు చేపట్టాలి. ఇందుకు ఐజీ  సర్క్యూలర్‌‌ జారీ చేయాలి.

హైకోర్టుకు వచ్చే వారికి ఉచితంగా మాస్కులు అందజేయాలి.

అన్ని కోర్టుల్లోనూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. టాయిలెట్స్‌‌ లో సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. జిల్లా కోర్టుల్లో కనీసం ఇద్దరు వైద్యులు ఉండేలా డీఎంఅండ్‌‌హెచ్‌‌వో ద్వారా చర్యలు తీసుకోవాలి.

నిందితులకు హాజరు మినహాయింపునివ్వండి

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిందితులు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించవద్దని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అన్ని కోర్టుల అధికారులకు లేఖ రాశారు. జైళ్లలో ఉంటున్న అండర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో పార్టీలుగా ఉన్నవారు కోర్టుకు రాకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. కరోనా వైరస్‌‌‌‌ వ్యాప్తి చెందకుండా కోర్టుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లలో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బంది విధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌‌‌‌లలో మెడికల్ టీమ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే ఫోన్‌‌‌‌ చేసిన వెంటనే వైద్యం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.