పదేండ్లలో జరిగింది అభివృద్ధి కాదు..అవినీతి: పౌరసమాజం

పదేండ్లలో జరిగింది అభివృద్ధి కాదు..అవినీతి: పౌరసమాజం

అవినీతి కేసీఆర్ మూడో సారి గెలిస్తే పబ్లిక్ గోస పడ్తరు
రాష్ట్ర ప్రజలకు పౌర సమాజం పిలుపు
మీడియాతో ఆకునూరి మురళి, హరగోపాల్, పాశం యాదగిరి, కన్నెగంటి రవి

హైదరాబాద్, వెలుగు:కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగింది అభివృద్ధి కాదు అవినీతి అని పౌరసమాజం ఆరోపించింది. బీఆర్​ఎస్​పాలన అంతా అవినీతి మయం అని, కేసీఆర్​మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజలు గోస పడ్తరని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అని కోరుతూ సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రిటైర్డ్ ఐఏఎస్, పౌరసమాజం కన్వీనర్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ హరగోపాల్, సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెసర్ పద్మజ షా, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి, డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ మీడియాతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పదేండ్లలో జరిగిన అవినీతి పాలన ప్రజలకు క్లియర్ గా కనపడుతుందన్నారు. ల్యాండ్, సాండ్ మాఫియాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా ఉన్నారని చెప్పారు. “వందల అబద్ధాలు చెప్పే సీఎం మనకు వద్దు. ఫామ్ హౌస్​లో ఉంటూ ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఐఏఎస్ లను, చీఫ్ ఇంజనీర్లను కలవని సీఎం మనకు వద్దు. నేను సరిగా పనిచేయలేదని గజ్వేల్ లో కేసీఆరే ఒప్పుకున్నరు. దళిత బంధు ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మిగతా వారికి ఆశ పుట్టించాడు. మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గోసపడతరు” అని మురళి అన్నారు.

అభివృద్ధి కాదు.. అవినీతి జరిగింది: హరగోపాల్

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతే పదేండ్లు ఒక కుటుంబమే బాగుపడిందని హరగోపాల్ ఆరోపించారు. పదేండ్ల నుంచి డెవలప్ మెంట్ జరగలేదని, అవినీతి జరిగిందని, మూడో సారి అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు.

“రాష్ట్రంలో ఎవరు ఆందోళనలు చేసినా, ఉద్యమాలు చేసినా అణిచివేయటమే. మేమే ఉద్యమం చేసినం, చావు నోట్లో తల పెట్టినం అని అబద్ధాలు ఆడుతున్నరు. తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు అందరూ ఉద్యమించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా బీఆర్ఎస్​పాలన సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా నిర్బంధం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి” అని అన్నారు.

ఇయాల్టి నుంచి జాగో యాత్ర

ఇయాల్టి నుంచి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో జాగో తెలంగాణ యాత్ర చేపడుతున్నట్లు పౌరసమాజం కన్వీనర్ ఆకునూరి మురళి వెల్లడించారు. ఇప్పటి వరకు 31 నియోజకవర్గాల్లో పూర్తి చేశామని, మరో 35 నియోజకవర్గాల్లో యాత్ర చేస్తామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.

పదేండ్లు విధ్వంసమే జరిగింది: పాశం యాదగిరి

రాష్ట్రంలో ఈ పదేండ్లు విధ్వంసం జరిగిందని పాశం యాదగిరి అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన దారుణంగా ఉందన్నారు. మోదీ ఇన్ని సార్లు రాష్ట్రానికి వచ్చిన కాళేశ్వరంపై చర్యలు తీసుకోకపోవడం, మేడిగడ్డ డ్యామేజ్ గురించి మాట్లాడకపోవటంతో బీజేపీ, బీఆర్ఎస్​ఒకటే అని అర్థమయిందన్నారు. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నేతల మద్దతు లేనిది రాష్ట్రంలో ఇంత అవినీతి జరగదని తెలిపారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిరూప్ రెడ్డి అన్నారు. ప్రజా సంఘాలు అన్ని కలిసి బీఆర్ఎస్​ను ఓడించాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా పౌర సమాజం ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తూ సమాజాన్ని జాగృతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మళ్లీ ఈ ప్రభుత్వం వస్తే ప్రజలు బతుకులు దుర్భరంగా మారుతాయని చెప్పారు. డాక్టర్ గోపినాథ్​మాట్లాడుతూ కేసీఆర్​రాష్ట్రంలో ఇంత నిరంకుశ పాలన సాగిస్తాడని పౌరసమాజం ఊహించలేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో మాట్లాడే అవకాశం, ప్రజాస్వామ్యం ఉండవన్నారు.