ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ బాకీ.. 1.60 లక్షలు

ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ బాకీ.. 1.60 లక్షలు
  • ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ బాకీ.. 1.60 లక్షలు
  •  రూ.3 వేల చొప్పున ఇస్తానన్న భృతి ఏమైంది: రేవంత్
  • టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలో కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే 
  • రైతులు, యువత బీఆర్ఎస్ ను బొంద పెడ్తరని హెచ్చరిక 
  • అధికారంలోకి వస్తే 2 లక్షల జాబ్స్ ఇస్తామని హామీ

ఆదిలాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఏమైందని సీఎం కేసీఆర్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.1.60 లక్షల చొప్పున కేసీఆర్ బాకీ పడ్డారు” అని చెప్పారు. ‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి శాసన సభలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. వాటిని ఏడాదిలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పోయినేడాది 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. అంటే ఉద్యోగ ఖాళీలు పెరిగాయంటే, జాబ్స్ భర్తీ చేయలేదనే కదా అర్థం. నిరుద్యోగులకు జాబ్స్ ఇయ్యని కేసీఆర్.. తన కుటుంబసభ్యులు, చుట్టాలకు మాత్రం జాబ్స్ ఇచ్చుకున్నారు” అని మండిపడ్డారు. బుధవారం ఆదిలాబాద్లో  నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లా పోరాటానికి మారుపేరు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమ్రంభీమ్, రాంజీ గోండు, తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజయ్యలను స్ఫూర్తిగా తీసుకొని యువత పోరాటానికి సిద్ధం కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. 

వచ్చే నెలలో సభకు ప్రియాంక.. 

టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ బర్తరఫ్ చేయాల్సిందేనని రేవంత్ డిమాండ్ చేశారు. కమిషన్ సభ్యులను తొలగించి.. సీబీఐ, సిట్టంగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ‘‘గ్రూప్ వన్ సహా జాబ్ రిక్రూట్ మెంట్ క్వశ్చన్ పేపర్లు బజార్ లో దొరుకుతున్నాయి. భద్రంగా ఉంచాల్సిన పేపర్లను బజార్ లో పెట్టిన కేసీఆర్ ను కూడా బజార్ కు ఈడ్చాలి” అని ఫైర్ అయ్యారు. మే మొదటి వారంలో సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్రియాంక గాంధీ వస్తారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా అంటున్నారు. ఓవైపు ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అంటుంటే, మరోవైపు ముస్లింలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ఇవ్వడం లేదు. కేసీఆర్ దొంగతో దోస్తాన చేస్తున్న అసదుద్దీన్.. మీరు ఎవరి వైపు ఉంటారో? తేల్చుకోండి” అని అన్నారు. 

జోగు రామన్న.. జోకుడు రామన్న  

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. జోకుడు రామన్న అని రేవంత్ విమర్శించారు. ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కు వెళ్లి జోకుడు తప్ప.. జిల్లాకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఆ జోకుడుతోనే ఒకసారి మంత్రి అయ్యారని, ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అయ్యారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిలాబాద్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు.  ‘‘ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు తుమ్మడిహెట్టి వద్ద నిర్మించి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గిరిజన, ఇంజనీరింగ్ యూనివర్సిటీలు తీసుకొస్తాం. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం” అని హామీ ఇచ్చారు.

కేసీఆర్, కేటీఆర్​కు మానవత్వం ఉందా? 

వడగండ్ల వానలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ కు మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ‘‘కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కానీ అయ్యనేమో ఔరంగాబాద్​లో, కొడుకు ప్లీనరీల పేరుతో రాజకీయ సభలు పెట్టుకొని ఊరేగుతున్నరు. వీళ్లకు మానవత్వం ఉందా? ఇది ప్రభుత్వమేనా? రైతులు, యువత ఏకమై బీఆర్ఎస్​ను బొందపెట్టే సమయం వస్తుంది’’ అని ట్వీట్ చేశారు.