బీజేపీలో అటెన్షన్..  క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరుగుతుంది..!

బీజేపీలో అటెన్షన్..  క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరుగుతుంది..!

తెలంగాణ బీజేపీలో అటెన్షన్ మొదలైంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణకు సంబంధించి కీలక నిర్ణయాలకు అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మరో వైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అక్కడికే వెళ్లారు. బీజేపీ తెలంగాణ ఫ్లోర్ లీడర్ గా తనకు అవకాశం కల్పించాలని రఘునందన్ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ ఉదయం ఢిల్లీ బయల్దేరారు.  పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షమార్పుపై చర్చ జరుగుతున్న తరుణంలో బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది మాత్రం తాము ఢిల్లీ వెళ్లటంలేదని, ముంబైకి వెళ్తున్నామని, ప్రత్యేక పూజల కోసమేనని చెబుతున్నారు. నిన్న కాజీపేటలో బండి సంజయ్ చేసిన కామెంట్స్  ఈ సందర్భంగా చర్చనీయాశంగా మారాయి. మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన బండి సంజయ్ ని పలురు స్థానిక నేతలు కలిశారు. ‘మీరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి’ అంటూ కంటతడి పెట్టుకున్నారని తెలిసింది. దీనిపై స్పందించిన బండి సంజయ్ తాను మోదీ సభకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో..? రానో అనటం గమనార్హం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర  పగ్గాలు అప్పగించి, బండి సంజయ్ ని క్యాబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం వారం రోజులుగా సాగుతున్నది. దీనికి కిషన్ రెడ్డి విముఖత వ్యక్తం చేసినట్టు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో జరిగే నిర్ణయాల ఆధారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. 

ALSO READ:రామకృష్ణ మఠ్ లో కన్నుల పండువగా గురు పూర్ణిమ వేడుకలు 

జితేందర్ రెడ్డి లంచ్ మీటింగ్

గత కొంత కాలంగా ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇవాళ తన ఫాం హౌస్ లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఓ వైపు ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్న తరుణంలో జితేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఈటల, మాజీ ఎంపీలు విజయశాంతి, గరికపాటి తదితరులకు ఆహ్వనం అందింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కూడా జితేందర్ రెడ్డి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కీలక సమయంలో జితేందర్ రెడ్డి  ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది.