టెస్ట్ క్రికెట్‌లో 'బజ్ బాల్' అంటే ఏంటి? ఆ పేరెందుకు వచ్చింది?

టెస్ట్ క్రికెట్‌లో 'బజ్ బాల్' అంటే ఏంటి? ఆ పేరెందుకు వచ్చింది?

'బజ్ బాల్..' ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు ఎక్కువుగా వినపడే పదం ఇదే. దూకుడుగా ఆడటమే బజ్ బాల్ కాన్సెప్ట్. అంతకుమించి మరొకటి లేదు. టెస్ట్ మ్యాచ్ కదా! ఐదురోజులు తీరుగ్గా ఆడదామన్నా ఆలోచన ఉండదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లయిన వన్డే, టీ20 తరహాలో ధనాధన్ మెరుపులు ఉంటాయి. బౌలింగ్ శైలి అలానే ఉంటుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. 

ఏడాది క్రితం వరకు ఇంగ్లండ్‌ను వరుస పరాజయాలు వేధించాయి. యాషెస్ సిరీస్‌ను 4-0 తేడాతో కోల్పోవడం, ఆపై వెస్టిండీస్‌ టూర్‌లోనూ ఓటమి పాలవ్వడంతో జో రూట్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌‌కు టెస్టు పగ్గాలు అప్పగిస్తారు. అదే సమయంలో క్రిస్ సిల్వర్‌వుడ్‌ని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని  నియమించారు. ఆనాటి నుంచి ఇంగ్లండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. 

ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగడమే ఇంగ్లండ్ బ్యాటర్ల పని. ఓవ‌కు మూడు నుంచి నాలుగేసి బౌండరీలు బాదుతూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తారు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఒత్తిడిలోకి జారుకుంటారు. అదే వారిని విజయాల బాట పట్టించింది. గతేడాది చివరలో పాకిస్థాన్ లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు.. వారికీ ఈ రుచి చూపించింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు.. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తూ పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 

 ఆ పేరెలా వచ్చిందంటే..?

ధాటిగా ఆడటంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ది మరో లెవెల్.  అందరూ టీ20 ఫార్మాట్ మొదలయ్యాక దూకుడుగా ఆడటం మొదలెట్టారేమో కానీ, మెక్‌కల్లమ్ ఎప్పుడో మొదలెట్టేశాడు. ఐపీఎల్ టోర్నీలో తొలి సెంచరీ చేసిన ఆటగాడు కూడా మెక్‌కల్లమే. బాల్ పడిందంటే ఫ్రంట్ ఫుట్ రావడం.. బంతిని బౌండరీకి తరలించడం అతని ప్రత్యేకత. అతన్ని అందరూ 'బజ్' అని పిలుస్తారు. ఆ కారణంగానే 'బజ్ బాల్..' అని పిలవడం మొదలుపెట్టారు.

కానీ, యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కు బజ్ బాల్ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వలేదు. ఆట తొలిరోజు తొలి ఇన్నింగ్స్ ను 393-8 d (78 ఓవర్లు) పరుగుల వద్ద డిక్లేర్ చేయడం వారిని దెబ్బకొట్టింది. ఆసీస్ సారథి పాట్ కమ్మిన్స్ ఆధ్బుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మ్యాచ్ ముగిశాక.. మాట్లాడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ .. బజ్ బాల్ విధానంపై వెనకడుగు వేసేది లేదని తెలిపాడు.