ఈ-రూపీ అంటేఏంటి?  డిజిట‌ల్ పేమెంట్స్‌లో కొత్తగా వ‌చ్చే మార్పులేంటి?

ఈ-రూపీ అంటేఏంటి?  డిజిట‌ల్ పేమెంట్స్‌లో కొత్తగా వ‌చ్చే మార్పులేంటి?

న్యూఢిల్లీ: ఈ-రూపీ (e-RUPI) కేంద్ర ప్ర‌భుత్వం కొత్తగా లాంచ్ చేసిన డిజిట‌ల్ క‌రెన్సీ. దీనిని సోమ‌వారం సాయంత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. అయితే అస‌లు ఈ-రూపీ అంటే ఏంటి? ఇది ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది? ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్ రంగంలో దీని ద్వారా వ‌చ్చే మార్పులేంటో ఒక్క‌సారి తెలుసుకుందాం.

ఈ-రూపీ ఎలా వాడాలి

  • ఈ-రూపీని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా డెవ‌ల‌ప్ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్, కేంద్ర‌ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, నేష‌న‌ల్ హెల్త్ అథారిటీల‌తో క‌లిసి దీనిని రూపొందించింది. 
  • ఈ-రూపీ.. ఇది క్యాష్‌లెస్, కాంటాక్ట్ లెస్ డిజిట‌ల్ పేమెంట్ విధానం ద్వారా వాడుకోగ‌లిగే ప్రీపెయిడ్ వోచ‌ర్.  క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ బేస్డ్ ఈ-వోచ‌ర్ యూజ‌ర్ మొబైల్‌కు వ‌స్తుంది. 
  • ఎటువంటి కార్డు గానీ, డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ లేకుండానే పేమెంట్ చేసేయొచ్చు. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్, యూజ‌ర్‌కు డైరెక్ట్‌గా ఎటువంటి కాంటాక్ట్ లేకుండానే దీనిని వాడుకోవ‌చ్చు. 
  • ముందే పేమెంట్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇద్దరి మ‌ధ్య లావాదేవీలు పూర్త‌యిన త‌ర్వాతే క‌స్ట‌మ‌ర్ నుంచి స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కు మ‌న ఈ-రూపీ చేరి పేమెంట్ కంప్లీట్ అవుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ అది హోల్డ్‌లోనే ఉంటుంది. ఈ-రూపీ తీసుకోవ‌డానికే ముందుగా పేమెంట్ చేసి ఉండ‌డం వ‌ల్ల దీనిని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కు పంపే విష‌యంలో ఈ బెనిఫిట్ క‌లుగుతుంది.
  • సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు ప్రభుత్వం నుంచి అందించే బెనిఫిట్స్ విష‌యంలోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూడొచ్చు.
  • మాతృ, శిశు సంక్షేమ ప‌థ‌కాలు, టీబీ నివార‌ణ కార్య‌క్ర‌మాలు, డ‌యాగ్నొస్టిక్ స్కీమ్స్ లాంటి వాటి కింద అందించే మందులు, పౌష్టికారం వంటి సేవ‌లు అందించ‌డానికి కూడా కేంద్రం ఈ-రూపీని వాడ‌నుంది. ఆయుష్మాన్ భార‌త్, ఎరువుల స‌బ్సిడీలు వంటి వాటికి కూడా ఉప‌యోగించ‌నుంది. ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ ప్రోగ్రామ్స్ లాంటి వాటికి ప్రైవేటు కంపెనీలూ దీనిని వాడుకోవ‌చ్చు.
  • ఈ-రూపీ పేమెంట్స్ చాలా ఈజీగా, సెక్యూర్డ్‌గా చేయొచ్చు. యూజ‌ర్ల ప్రైవ‌సీ కూడా దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. 

కార్పొరేట్స్ ఎలా వాడుకోవ‌చ్చు?

  • కార్పొరేట్ కంపెనీలు త‌మ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన స్కీమ్స్ ఈ-రూపీ ద్వారా అందిచ‌వ‌చ్చు.
  • ఈ వోచ‌ర్ రిడీమ్ చేసుకున్నారా లేదా అన్న‌ది ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవ‌చ్చు.
     

క‌స్ట‌మ‌ర్‌కు బెనిఫిట్ ఏంటి?

  • కాంటాక్ట్ లెస్ - వోచ‌ర్‌ను ఫిజిక‌ల్‌గా ప్రింట్ రూపంలో తీసుకెళ్లాల్సిన ప‌నిలేదు.
  • సెక్యూర్ - 2 స్టెప్ వెరిఫికేష‌న్‌తో సేఫ్‌గా, ఈజీగా రిడీమ్ చేసుకోవ‌చ్చు. 
  • ప్రైవ‌సీ - యూజ‌ర్లు ఎటువంటి వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌కు షేర్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టీ ప్రైవ‌సీ విష‌యంలో భ‌యం ఉండ‌దు.
  • బ్యాంకుతో ప‌ని లేదు - ఈ వోచ‌ర్‌ను రిడీమ్ చేసుకోవ‌డానికి క‌స్ట‌మ‌ర్‌కు డిజిట‌ల్ పేమెంట్ యాప్ గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ అవ‌స‌రం లేదు.

ఈ-రూపీని ఆఫ‌ర్ చేసే బ్యాంకులు
 
యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కెన‌రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండ‌సెండ్, కొటాక్, ఇండియ‌న్ బ్యాంక్, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐల ద్వారా ఈ-రూపీని తీసుకోవ‌చ్చు.