అమెరికా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు సైన్యం మోహరింపులు పెంచుతూ యుద్ధనౌకలను సిద్ధం చేయడం ఇప్పుడు పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ సిద్ధమవుతున్న వేళ అమెరికా తన సైనిక బలగాలను ఏకంగా 50 వేలకు పెంచడం అనుమానాలను ఆందోళనను కలిగిస్తోంది. సాధారణంగా ఉండే 40 వేల బలగాలకు అదనంగా మరో 10 వేల మంది సైనికులను చేర్చడం, యుద్ధ విమానాలను రంగంలోకి దించడం చూస్తుంటే.. ఇది కేవలం రక్షణ కోసం చేస్తున్న ఏర్పాట్లా లేక చర్చల పేరుతో ఆడుతున్న డబుల్ గేమ్' ఆ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. చర్చల్లో తన పట్టును పెంచుకోవడానికి 'సైనిక శక్తిని' ఒక ఆయుధంగా వాడుతున్నారు. "వార్ షిప్స్ లోడ్ అవుతున్నాయి. 24 గంటల్లో విషయం తేలిపోవాలి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌కు అల్టిమేటంలా మారింది. ముఖ్యంగా 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన వేల మంది పారాట్రూపర్లు, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ బుష్ వంటి భారీ విమానవాహక నౌకలను తరలించడం ద్వారా.. ఒకవేళ చర్చలు విఫలమైతే తదుపరి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అమెరికా ముందే హెచ్చరిస్తోంది.
ఇరాన్ సైతం ఈ ఒత్తిడికి తలొగ్గేలా కనిపించడం లేదు. లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగితేనే చర్చలు అని కండిషన్ పెడుతూనే.. అమెరికాపై తమకు నమ్మకం లేదని కుండబద్దలు కొట్టింది. ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకే అమెరికా ఈ బలగాలను మోహరించిందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇరాన్ వంటి భౌగోళికంగా పెద్ద దేశంపై 50 వేల మందితో పూర్తిస్థాయి యుద్ధం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నప్పటికీ.. సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు ఈ బలగాలు సరిపోతాయని అంటున్నారు.
ఇది చర్చల కంటే కూడా 'మాటకు మాట.. దెబ్బకు దెబ్బ' అన్నట్లుగా సాగుతున్న మైండ్ గేమ్. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ప్రపంచ చమురు సరఫరాకు ముప్పు కలగకుండా చూసుకోవడం అమెరికాకు ఒక సవాల్ అయితే.. తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడం ఇరాన్‌కు అత్యవసరం. మరి ఈ 10 వేల మంది అదనపు సైనికులు శాంతికి బాటలు వేస్తారా లేక పశ్చిమాసియాను మరో భారీ యుద్ధంలోకి నెడతారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అమెరికా ఆడుతున్న ఈ రెండు వైపుల వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.
