పార్కులు తెరిచేందుకు ఇబ్బందేంటి?.సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

పార్కులు తెరిచేందుకు ఇబ్బందేంటి?.సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: కరోనా రూల్స్​ను కేంద్రం సడలించిన నేపథ్యంలో పార్కులను తెరిచేందుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ పార్కులను తెరవాలనే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారో చెప్పాలని, కేబీఆర్‌ పార్క్‌ తెరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించింది. కేబీఆర్‌ పార్క్‌ను తెరవకపోవడాన్ని సవాల్‌ చేస్తూ బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్‌ ఎం.జయంత్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని మంగళవారం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారించారు. అన్‌లాక్‌ రూల్స్‌-4 కింద పార్కుల్ని తెరవచ్చని పిటిషనర్‌ తరఫు లాయర్​ రావిళ్ల గోపాలకృష్ణ చెప్పారు. కేబీఆర్‌ పార్క్‌ను తెరవాలని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. మెట్రో రైళ్లు, షాపింగ్‌ మాల్స్, పెద్ద పెద్ద షాపుల్ని తెరుస్తున్నప్పుడు ఆరోగ్యం, ఆహ్లాదం ఇచ్చే పార్కుల్ని తెరవకపోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ విధానం తెలిసిన తర్వాత 28న తుది విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.