
గురుపూర్ణిమ.. భారతీయ సంస్కృతిలో ఈ పర్వదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక వ్యక్తి వివేకం, విజ్ఞానంతో.. జీవిత లక్ష్యం, ఆశయం ఏంటో తెలుసుకోవడంలో గురువు పాత్ర చాలా కీలకం. అలాంటి గురువు గొప్పతనం గురించి.. గురుశిశ్య సంబంధం తెలుసుకునేందుకు గురుపూర్ణిమ మార్గనిర్దేశనం చేస్తుంది. అయితే గురువు అంటే ఎవరు.. ఒక వ్యక్తి తన జీవితంలో గురువును ఎలా కనుగొంటాడు.. మొదలైన అంశాల గురించి తెలుసుకోవాల్సి ఆవశ్యకత ఉంది.
‘గురు’ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది: ‘గు’ అంటే అంధకారం, ‘రు’ అంటే తొలగించడం. అంటే ఒక గురువు శిశ్యులను అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటపడేసి జ్ఞానం వైపు నడిపిస్తాడు. మరి అలాంటి నిజమైన గురువును ఎలా కనుగొంటారు? అయితే మనం గురువును కనుగొనం, గురువే మనల్ని కనుగొంటాడని గురుపరంపర నుంచి వస్తున్న అభిప్రాయం. పరమ సత్యం పట్ల మన తపన తీవ్రమైనప్పుడు, ఆత్మసాక్షాత్కారం వైపు సవాలుతో కూడిన ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ఒక దైవిక మార్గాన్ని లేదా గురువును పంపుతాడు.
స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా అన్నారు: “స్వేచ్చా సంకల్పం అనేది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏర్పడ్డ అలవాట్లు లేక మానసికోద్రేకాలకు లోబడి ప్రవర్తించడంలో లేదు.” అని అంటారు. సాధారణ మానవులు సంక్షోభంలో, దుఃఖంలో, ఆనందంలో కూడా తమ సంకల్ప శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించకుండానే తమ నిత్య జీవితాలను గడుపుతారు. స్వేచ్ఛ అంటే నిజానికి మన అహం-ప్రేరిత స్వభావం నుండి విముక్తి పొందడమే.
పరమహంస యోగానంద అటువంటి సద్గురువులలో ఒకరు. క్రియాయోగ మార్గ జ్ఞానాన్ని ప్రపంచానికి విస్తరింపజేయడానికి కృషి చేశారు. లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించిన ఆయన ఆధ్యాత్మిక గ్రంథమైన “ ఒక యోగి ఆత్మకథ”లో, యోగానంద ఇలా రాశారు: ‘‘క్రియాయోగమన్నది మనిషి రక్తంలో కర్బనాన్ని హరింపజేసి.. ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక-శారీరక ప్రక్రియ. ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి, దీనితో ఒక యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ మొత్తానికే ఆపెయ్యడం కాని చేయగలడు’’ అని అంటారు.
ఆధ్యాత్మిక పురోగతికి అటువంటి శక్తివంతమైన పద్ధతిని మానవాళితో పంచుకోవడం తప్పనిసరి. ఈ ఉద్దేశ్యంతోనే, యోగానంద తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రోద్బలంతో, 1917 లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను, 1920 లో లాస్ ఏంజిల్స్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు. సత్య జిజ్ఞాసువులకు క్రియాయోగ బోధనలు ఇంటి వద్దే చదివుకునేలా పాఠాల రూపంలో అందుబాటులో ఉన్నాయి.
విశ్వాసి తపన లోతుగా ఉండి, దేవుడిని తెలుసుకోవాలని నిరంతర ఆకాంక్ష ఉంటే, ఒక సద్గురువు స్వయంగా తన శిష్యుడికి మార్గనిర్దేశం చేయడానికి వస్తాడని నమ్ముతారు. ఇది ఒక సద్గురువు దివ్య వాగ్దానం. సంత్ కబీర్ మాటల్లో, “సద్గురువును కనుగొన్న శిష్యుడు ఎంతో గొప్ప అదృష్టవంతుడు!”
మరింత సమాచారం కోసం: yssofindia.org వెబ్ సైట్ ను సందర్శించగలరు.