- జూన్ 24లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశం
- జీవో 7లోని 12 నిబంధనపై స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీబీటీ పద్ధతిలో విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమచేస్తామని, అప్పటిదాకా విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దన్న జీవో 7లోని 12 నిబంధనను నిలిపివేస్తూ గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా కొనసాగుతాయని తేల్చి చెప్పింది.
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని కోరారు. ఇప్పటికే పలు కాలేజీలకు టోకెన్లు జారీ అయిన మొత్తాలతో పాటు సంబంధిత సంక్షేమశాఖల ద్వారా ఫీజు రీఎంబర్స్‌మెంట్ విధానం కింద చెల్లింపులు కొనసాగుతాయన్నారు.
అంతేగాకుండా ఫీజు మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో నేరుగా జమ చేశాక, వారు కాలేజీలకు చెల్లిస్తారని, అప్పటివరకు చెల్లింపులకు ఒత్తిడి తీసుకురావద్దంటూ జీవో7లోని 5వ పేరా 12వ నిబంధనపై వివరణ ఇవ్వడానికి సైతం మరికొంత గడువు కావాలన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన కారణంగా ప్రభుత్వం చెల్లించాల్సిన పాత బకాయిలపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆ బాధ్యతను విస్మరించబోమని స్పష్టం చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జీవోలోని 5వ పేరా 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో నేరుగా విద్యార్థుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని, తర్వాత విద్యార్థులు టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన మొత్తాలను ఖాతాల నుంచి చెల్లిస్తారని పేర్కొందన్నారు.
దీనివల్ల కాలేజీలు ఫీజులను వసూలు చేసే పరిస్థితి ఉండదని, ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ గత వారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేగాకుండా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా జీవోలోని నిబంధనపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
