
- నిర్మాణం పూర్తయి ఏడాదైనా ప్రారంభం కాని.. రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్
ఎల్ బీనగర్, వెలుగు : ఇబ్రహీంపట్నం పరిధి గర్ కలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొత్త బిల్డింగ్ ‘ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్’ పనులు పూర్తయి ఏడాది గడుస్తున్న ఇప్పటికీ దాన్ని ప్రారంభించడం లేదు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు గ్రేటర్ హైదరాబాద్‌లో భాగంగానే ఉన్నప్పటికీ అవి శివారు ప్రాంతాలు కావడంతో అక్కడి జనాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు లక్డీకపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీసుకు రావాల్సి వచ్చేది. శివారు ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది ఇబ్బందిగా మారింది. జనాలకు ఈ దూరాన్ని తగ్గించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ పరిధి కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాలని ఐదేండ్ల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. 36 శాఖలు ఒకే దగ్గర ఉండేలా ‘ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్’ పేరుతో నిర్మాణానికి కొంగర కలాన్ లో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 2017 అక్టోబర్ 12న అప్పటి ఎక్సైజ్ మంత్రి పద్మారావు కొత్త బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల్లో జీ ప్లస్2 బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.33 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో వాటిని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ బిల్లులు సకాలంలో అందకపోవడంతో ఆలస్యమైంది.
గతేడాదిలోనే..
గతేడాదిలోనే పనులు పూర్తయినా.. ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ నెల 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కలెక్టరేట్‌ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ప్రారంభోత్సవం జరగలేదు. గతంలోనూ ఇలా రెండు సార్లు ప్రారంభోత్సవానికి ప్లాన్ చేసినా అమలు కాలేదు. దీంతో కలెక్టరేట్ బిల్డింగ్ వృథాగా ఉంది. మెయిన్ బిల్డింగ్ దగ్గర నేమ్ లెటర్స్ సైతం ఊడి కిందపడిపోతున్నాయి. ప్రస్తుతం సిటీలో ఉన్న కలెక్టరేట్ ఇబ్రహీంపట్నం ,అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల వారికి అందుబాటులో ఉన్నా.. ఆమన్ గల్, షాద్ నగర్, చేవెళ్ల నుంచి నుంచి వచ్చే వారికి దూరంగా ఉంది. దీంతో కొంగర్ కలాన్‌లో నిర్మించిన కొత్త కలెక్టరేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగులు, సిబ్బందికి సర్ది చెప్పే పనిలో అధికారులు..
నిర్మాణంతో పాటు గార్డెనింగ్,ఎలక్ట్రికల్ వర్క్ కూడా పూర్తయి బిల్డింగ్ రెడీగా ఉన్నప్పటికీ ప్రారంభించకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లక్డీకపూల్ లో ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది సిటీ శివార్లలోని కొంగర కలాన్‌లో పనిచేసేందుకు ఇష్టంగా లేరని తెలుస్తోంది. వారికి సర్ది చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. షాద్ నగర్, చేవెళ్ల వాసులు మొదట కొంగర కలాన్ లో కలెక్టరేట్ ను వ్యతిరేకించారు. ఇప్పుడు అక్కడ జనాలు సైతం కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను తొందరగా ప్రారంభించాలని కోరుతున్నారు.
ట్రాన్స్ పోర్టు లేకనే కలెక్టరేట్ నిర్మాణాన్ని వ్యతిరేకించాం
షాద్ నగర్‌లోని రూరల్ ఏరియాల నుంచి సరైన ట్రాన్స్ పోర్టు లేకనే కొంగరకలాన్‌లో కలెక్టరేట్ నిర్మాణాన్ని వ్యతిరేకించాం. అయినప్పటికీ ప్రభుత్వం అక్కడ నిర్మాణాన్ని పూర్తి చేసింది. రూరల్ ఏరియాల నుంచి కొంగరకలాన్‌కు సరైన ట్రాన్స్ పోర్టును కల్పించాలి. రూ. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కలెక్టరేట్‌ను తొందరగా ప్రారంభించాలి.
- శ్రీనివాస్, షాద్ నగర్